గురుకులాల్లో సీట్ల భర్తీ పూర్తి..


Ens Balu
1
Vizianagaram
2020-10-01 18:38:43

విజయనగరం  జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల నిమిత్తం లాటరీ ద్వారా చేపట్టిన సీట్ల ఎంపిక ప్రక్రియ గురువారంతో ముగిసింది. సెప్టెంబర్ 30న బాలురకు, అక్టోబరు 01న బాలికల ప్రవేశాలకు సీట్ల ఎంపిక ప్రక్రియను విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరయంలో నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణిల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియ సజావుగా సాగినట్లు బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి, బీసీ కార్పొరేషన్ ఈడి నాగరాణిలు పేర్కొన్నారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఉన్న 10 బాలుర పాఠశాలల్లో సీట్లకు మొదటి రోజు ఎంపిక చేపట్టగా గజపతి నగరం, కారాడ, కురుపాం, విజయనగరంలోని పాఠశాలల్లో మొత్తం 280 సీట్లకు గాను 558 దరఖాస్తులు వచ్చాయని 266 మందికి అవకాశం కల్పించామని వివరించారు. రెండో రోజు గురువారం మొత్తం అయిదు పాఠశాలల్లో ఉన్న మొత్తం 320 సీట్లకు గాను 521 దరఖాస్తులు రాగా 305 మంది బాలికలకు చోటు లభించిందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రవేశాలకు అధిక మొత్తంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం హర్షణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆశించిన మేరకు విద్యార్థుల నుంచి స్పందన రావడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. గురుకుల కార్యదర్శి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.   కార్యక్రమంలో సెలెక్ట్ కమిటీ కన్వీనర్, నెల్లిమర్ల కస్తూర్బా కళాశాల ప్రిన్సిపాల్ డి.సత్యారావు, కమిటీ సభ్యులు ఎం.పెంటయ్య, జి. పురుషోది, యు.వి. కె. పాత్రో, కె.ఈశ్వరరావు, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.