నాడు-నేడులో నాణ్యత తగ్గకూడదు..
Ens Balu
3
Anantapur
2020-10-01 19:14:03
అనంతపురము జిల్లాలో మనబడి నాడు - నేడు కింద చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని కక్కలపల్లి కాలనీలో ఉన్న ఎంపిపియుపి పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నాడు- నేడు కింద ఎంపిపియుపి మోడల్ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలో నిర్మించిన తాగునీటి కుళాయిలను పరిశీలించి, ఒకటో తరగతి విద్యార్థులకు కుళాయిలు అందే విధంగా నిర్మించలేదని, వెంటనే వారికి కూడా నీరు అందేలా తగిన ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అందిన ఆటవస్తువులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ ఫ్లోరింగ్ లో హెచ్చుతగ్గులు ఉండటాన్ని గమనించి వెంటనే వాటిని సరిదిద్దవలసిందిగా సైట్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డిని ఆదేశించారు. పనులు సక్రమంగా చేపట్టక పోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని సైట్ ఇంజినీర్ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు -నేడు పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, అందుకు తగ్గట్లుగా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. పనులు ఆలస్యంగా జరగడంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శామ్యూల్, ఏపీ సి తిలక్ విద్యా సాగర్, సమగ్ర శిక్ష ఈ ఈ శివ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.