కరోనా రోగులు మనోదైర్యంతో ఉండాలి..


Ens Balu
4
Anantapur
2020-10-01 19:20:17

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని, ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన పనిలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దైర్యాన్నిచ్చారు. గురు వారం సాయంత్రం స్థానిక శారదా నగర్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు క్యాన్సర్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వచ్చి నవారిని పరామర్శించి వారికి జిల్లా కలెక్టర్ దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ నేరుగా సంభాషించారు. ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయి, డాక్టర్లు సమయానికి చికిత్స అందిస్తున్నారా లేదా, ఇక్కడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం రుచికరంగా ఉందా లేదా తదితర అంశాలపై వారి నుండి సమాధానాన్ని రాబట్టారు. ఇక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది చాలా బాగా వైద్య సేవలు అందిస్తున్నారని, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, సమయానికి అన్నీ సమకూరుస్తున్నారు పాజిటివ్ వచ్చిన వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. తమపై మరింత శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాధిపట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, సరైన చికిత్స అందించడం ద్వారా ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటున్నారన్నారు. ఇప్పటికే సుమారు 60 వేల మంది కోవిడ్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొని, దాని నుంచి కోలుకుని వారు ఇళ్లకు సంతోషంగా వెళ్లారని తెలిపారు. కోవిడ్ పట్ల ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.  అనంతరం అక్కడ వైద్య సేవలు అందిస్తున్న  నర్సులను అభినందిస్తూ, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మీరు అందిస్తున్న సేవలు బాగున్నాయని పాజిటివ్ వచ్చినవారు తెలిపారన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుపమని సిబ్బందిని కోరగా, వారు తమకు తోడుగా మరింత సిబ్బందిని కేటాయించాలని కోరారు. అలాగే తమలో కొందరు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నామని, తమకు అనంతపురం పట్టణంలో వసతి సౌకర్యం కల్పించాల్సిందిగా వారు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఫోన్లో ఆదేశాలిస్తూ, అనంతపురం పట్టణంలో అతి తక్కువ ధరలో సురక్షితమైన ప్రాంతంలో ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రెండు, మూడు రోజుల్లో అద్దె ప్రాతిపదికన వసతి సౌకర్యాలు కల్పించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఆసుపత్రికి వచ్చే మార్గంలో వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం అదే ప్రాంగణంలోని క్యాన్సర్ హాస్పిటల్ సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, వారికి అందుతున్న వైద్యసేవలు పట్ల కలెక్టర్ ఆరా తీశారు. అక్కడి వారికి వినోద కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అనేది వాకబు చేశారు. వెంటనే ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించిన వినోద కార్యక్రమాలను పాజిటివ్ వచ్చిన వారితో పాటు కలిసి కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, ఇంచార్జ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. కే ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.