ప్రజలకు మెరుగైన సేవలందించాలి..
Ens Balu
4
Anantapur
2020-10-01 19:40:42
సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సచివాలయ సిబ్బందిని దేశించారు. గురువారం నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న 64 వ వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వార్డు సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, వాటిలో ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి అందిన అర్జీలకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి బయోమెట్రిక్ విధానాన్ని తనిఖీ చేశారు. ఉద్యోగులంతా సకాలంలో సచివాలయానికి హాజరై ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసి వారి నుంచి వచ్చిన సర్వీసు లకు సత్వరమే పరిష్కారం చూపించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు 64వ వార్డు సచివాలయం ద్వారా 999 సర్వీసులకు పరిష్కారం చూపించినట్లు ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
వార్డు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై విరివిగా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు కార్యదర్సులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వార్డు సచివాలయం లో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. సచివాలయంలో 2020 - 21 సంక్షేమ క్యాలెండర్ ని మరింత పెద్దదిగా ప్రదర్శించాలని సూచించారు. వార్డు సచివాలయం పరిధిలో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ చూపాలని , కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను వార్డు సచివాలయ పరిధిలో ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ పి వి ఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, కార్పొరేషన్ సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.