15 వరకు ఆర్.బి.కెల్లోనే రిజిస్ట్రేషన్లు..


Ens Balu
2
Srikakulam
2020-10-01 20:24:45

శ్రీకాకుళం జిల్లాలోని రైతులందరూ రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జె.సి  వ్యవసాయ అధికారులతో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతీ పంటను రైతు భరోసా కేంద్రాల (ఆర్.బి.కె ) ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రతీ రైతు తమ సమీప రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అక్టోబర్ 1 నుండి ప్రారంభమైందని, ఈ నెల 15 వరకు రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. కావున ప్రతీ మండల వ్యవసాయ అధికారి  గ్రామ వ్యవసాయ అధికారులతో కలిసి రోజుకు రెండు ఆర్.బి.కెల పరిధిలోని రైతులకు రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ మండల వ్యవసాయ అధికారికి ఆర్.బి.కెల వివరాలు, ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వివరాలను ఇప్పటికే అందించడం జరిగిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుండే పంట కొనుగోళ్లు ఉంటాయనే విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. జిల్లాలోని లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాల్లోని 13వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు వేసారని, సుమారు 50వేల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయితే షెడ్యూలు ప్రకారం కొనుగోళ్లు చేపట్టడం జరుగుతుందని జె.సి వివరించారు. అనంతరం ఇ-క్రాప్ బుకింగ్ గురించి మాట్లాడుతూ జిల్లాలో ఇ-క్రాప్ బుకింగ్ సాధ్యమైనంత మేర అయిందని, ఇందుకు కృషిచేసిన వ్యవసాయ అధికారులను జె.సి అభినందించారు. సాంకేతికపరమైన అంశాలతో ఇంకా జిల్లాలో  4 వేల ఎకరాల వరకు ఇ-క్రాప్ జరగవలసి ఉందని, వాటిని సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలన్నారు. ఇ-క్రాప్ తోనే రైతు భరోసా, క్రాప్ ఇన్స్యూరెన్స్ వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని, కావున రైతులు ఇ-క్రాప్ చేసుకునేలా చూడాలని జె.సి వివరించారు. జిల్లాలో 14 మండలాల్లో సాదారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, గడిచిన మూడు మాసాలుగా ఇదేపరిస్థితి ఉందన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు అధ్యయనం చేసి, ఆ మండలాల్లో పంటలు నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించాలని అన్నారు.   ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ఉప సంచాలకులు రాబార్ట్ పాల్, సహాయ సంచాలకులు తిరుమలరావు, రాజగోపాల్, వెంకటరావు, రవిప్రకాశ్, మధు, భ్రమరాంబ, రవీంద్రభారతి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.