సమగ్ర పరిశ్రమ సర్వే వేగవంతం చేయాలి..
Ens Balu
2
Anantapur
2020-10-01 20:38:12
అనంతపురం జిల్లాలో చేపడుతున్న సమగ్ర పరిశ్రమ సర్వే 2020 ను వేగవంతం చేయాలని జాయింట్ డైరెక్టర్ ఎం.ఉదయభాస్కర్ పరిశ్రమల అభివృద్ధి అధికారు లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిశ్రమల కేంద్రం కార్యాలయంలో అనంతపురంజిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర పరిశ్రమ సర్వేపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ లోపు సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. .ఈ సర్వే నందు ప్రతి పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారని మరియు మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ ,వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ఆయా కంపెనీలకు "పరిశ్రమ ఆధార్ " నంబర్ కేటాయిస్తుందన్నారు . తద్వారా కంపెనీలు , పరిశ్రమలకు చెందిన వివిధ సెక్టార్ల వివరాలతో కూడిన పూర్తి జాబితా ప్రభుత్వం వద్ద ఉంటుందన్నారు. ఈ సర్వేలో ప్రమోటర్లు, ఆయా రంగాల పెట్టుబడి ఎగుమతులు, దిగుమతులు , విద్యుత్, క్రెడిట్ అవసరము ఉద్యోగి మరియు నైపుణ్యాల సమగ్ర సమాచారాలు రీ-స్కిల్లింగ్ అవసరము మరియు మార్కెటింగ్ వివరాలు ఉంటాయని తెలిపారు . పరిశ్రమల యాజమాన్యం సర్వే కొరకు విచ్చేసే అధికారులకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యాలు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో జరుగుతున్న సమగ్ర పరిశ్రమ సర్వే సమీక్షలో జిల్లాలోని 44 మండలాల్లో గ్రామ స్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా, పట్టణాల్లో వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు జాయింట్ డైరెక్టర్ కు వివరించారు. అలాగే మిగతా మండలాల్లో కూడా సర్వే ప్రారంభించాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు . జిల్లా వ్యాప్తంగా 1208 పరిశ్రమలకు సంబంధించి సర్వే చేపట్టాల్సి ఉండగా, నేడు 635 సర్వేలను పూర్తి చేయడం జరిగిందని, 562 ప్రగతిలో ఉన్నాయని అధికారులు జాయింట్ డైరెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఉపసంచాలకులు నాగరాజారావు, ఎడి అన్వరుల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.