గాంధీజీ కలలకు ప్రతిరూపమే సచివాలయ వ్యవస్థ
Ens Balu
1
Vizianagaram
2020-10-02 13:54:22
జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఏడాది క్రితం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం జరిగిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజి కలల సాకారానికే సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడంతోపాటు, వేలాది మందికి ఉద్యోగాలనిచ్చి, ప్రభుత్వం వారి కుటుంబాల్లో వెలుగును నింపిందని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా అసలైన గ్రామ స్వరాజ్య వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులతో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు తదితర భవనాల నిర్మాణం భారీ ఎత్తున చేపట్టామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవన్నీ మరో ఆరునెలలో పూర్తి చేసి, గ్రామ స్వరూపాన్ని మారుస్తామని ప్రకటించారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమల్లో జిల్లా మొదటి స్థానంలో ఉందని, దీనికి అందరి సమిష్టి కృషే కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలను సాధించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్ఓ ఎం.గణపతిరావు, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ ఎంవిఏ నర్సింహులు, డ్వామా పిడి ఏ.నాగేశ్వర్రావు, జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి, డిబిసిడబ్ల్యూఓ కీర్తి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, మత్స్యశాఖ డిడి జి.నిర్మల, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, డిఎస్ఓ పాపారావు, చేనేత జౌళిశాఖ ఎడి పెద్దిరాజు, సహకార అధికారి ఎస్.అప్పలనాయుడు, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.