గ్రామ స్వరాజ్యాన్ని సాధనే ప్రభుత్వ లక్ష్యం..
Ens Balu
5
2020-10-02 20:34:44
గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట పట్టణంలోని దేశవానిపేటలో గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం ఉప ముఖ్య మంత్రి ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బికే) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం వైయస్సార్ జలకళ పథకం బోర్ రిగ్గును జెండా ఊపి ప్రారంభించారు. ఉప ముఖ్య మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాకారమైందని పేర్కొన్నారు. మహాత్ముడి జయంతి రోజునే సరిగ్గా ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైందని చెప్పారు. దశాబ్ధాల పరిపాలన చేసిన వారు, రాజకీయ అనుభవం ఉన్న వారు చేయలేని గ్రామ స్వరాజ్యం అనే సంకల్పాన్ని వై.ఎస్.జగన్ అనే యువకుడు చేసి చూపించారని కొనియాడారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టారని, ప్రభుత్వ పాలనను గ్రామాల చెంతకు చేర్చారని చెప్పారు. ముందు చూపు ఉన్నవాడే సరైన నాయకుడని పేర్కొంటూ ఇలాంటి నాయకుడే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. దీనికి నిదర్శనం ఆయన పాలన అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏమి చేయాలన్న దానిపై స్పష్టతతో, ఏమి చేస్తాననే విషయం ముందుగానే ప్రజలకు తెలియజేసారని ఉప ముఖ్య మంత్రి తెలిపారు. నవరత్నాలు, గ్రామ సచివాలయాలు.. ఇలా ప్రతి అంశాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే ప్రజలకు వివరించారని, మాటల్లో కాదు చేతల్లో చూపించే సీఎంగా, బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. గ్రామ స్థాయి నుంచి పరిపాలన జరగాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేసే పధకాలు చేరువ కావాలనే ఆలోచనతో, లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడమే కాకుండా వాలంటీర్లతో కలుపుకొని 4.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. 560కి పైగా సేవలను సచివాలయాల ద్వారా గ్రామాల్లోనే అందిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామ సచివాలయానికి అదనంగా రైతులు, పాడి రైతులకు సేవలందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వై.ఎస్.ఆర్ విలేజ్ క్లినిక్ పేరిట ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారని వివరించారు. గోదాములు, శీతల గిడ్డంగులు కూడా గ్రామ సచివాలయ ప్రాంగణంలోనే ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్‌లకు భవనాలు, గోదాము, శీతల గిడ్డంగులు అందుబాటులోకి రానున్నాయని ఉప ముఖ్య మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సంకల్పించారని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి తన స్వగ్రామమైన మబగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.