దేశంలోనో సచివాలయ వ్యవస్థ ఒక చారిత్రాత్మకం..
Ens Balu
3
Vizianagaram
2020-10-02 21:06:36
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఒక చారిత్రక నిర్ణయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తియిన సందర్భంగా, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద చప్పట్లతో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ వల్ల పరిపాలన సులభతరం అయ్యిందన్నారు. ప్రభుత్వ సేవలు నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాదిమందికి ఉద్యోగాలు లభించడం ద్వారా, వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆచరణ సాధ్యం అవుతుండటానికి ఈ వ్యవస్థ ఒక కారణమన్నారు. పింఛన్ల పంపిణీ, స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో, జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రధమ స్థానంలో నిలవడానికి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కూడా ఒక కారణమని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, మెప్మా పిడి కోట్ల సుగుణాకరరావు, సమాచారశాఖ ఎడి డి.రమేష్, డిపిఎం పద్మావతి, ఫిషరీస్ డిడి జి.నిర్మలకుమారి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.