ఆలయ దస్త్రాల్లో ప్రభుత్వం జోక్యం తగదు..
Ens Balu
3
Simhachalam
2020-10-03 14:40:27
సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ దస్త్రాలు నేరుగా ప్రత్యేక కమీషనర్ పరిశీలించేలాగా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వడం వెనుక దురుద్ధేశాలు ఉన్నాయని హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం ఈ మేరకు సింహాచలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ జారీచేసిన ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ఆదాయం వచ్చే దేవాలయాల దస్త్రాలు క్రింది స్ధాయి నుంచి పరిశీలిస్తూ ప్రత్యేక కమీషనర్ కి చేరేలా నిబంధనలు ఉన్నాయన్నారు. వీటిని ఇప్పుడు ఒక్క సింహాచలం, మాన్సాస్ విషయంలో మాత్రమే మార్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటీవల సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కి ఓఎస్డీ గా బయటి వ్యక్తిని నియమించేందుకు పాలకవర్గం తీర్మానిస్తే, అందుకు నిబంధనలు అంగీకరించలేదన్నారు. కేవలం ఆలయ ఉద్యోగినే ఓఎస్డీ గా తీసుకోవాలని సంయుక్త కమీషనర్ చెప్పడమే ఇప్పుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి కారణమా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు దేవస్థానంతో సంబంధం లేని వ్యక్తి సింహాచలం కొండపైన ఏ హక్కుతో మే నెల నుండి తిష్ట వేశాడని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యక్తికి అధికారులు ఎందుకు అడుగులకి మడుగులొత్తుతున్నారో ప్రభుత్వం భక్తులకు చెప్పాలన్నారు. వెంటనే ఆ బయటి వ్యక్తిని సింహాచలం నుంచి తొలగించాలన్నారు. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ లకి ఛైర్మన్ గా రాత్రికి రాత్రి సంచయితను తీసుకు వచ్చినప్పటి నుండి వివాదాలు వస్తున్నాయని ఆరోపించారు. మాన్సాస్ కి చెందిన విద్యా సంస్థల ను ప్రైవేట్ పరం చెయ్యాలి అని కూడా మరో వివాదాస్పద నిర్ణయం సంచయిత తీసుకోవడం దారుణమన్నారు. ఎయిడ్ డెడ్ సంస్థగా వున్న దాన్ని ఎందుకు ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. సింహాచలం భూములు లీజుకు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని, సింహాచలం భూములు, ఆస్తులు కొట్టేసే సీక్రెట్ మిషన్ ఏమైనా సంచయిత గారికి అప్పగించే ఆమెను రంగంలోకి దించారా అని ప్రశ్నించారు. సింహాచలం, మాన్సాస్ లో జరుగుతున్న వ్యవహారాల పైన స్వామీజీలు గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అలాగే ఇప్పుడు తాజాగా చేసిన నిబంధనల మార్పు ఎందుకు జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తురగా శ్రీరామ్ డిమాండ్ చేశారు.