నిర్వాసితులకు 2రోజుల్లో నష్టపరిహారం..
Ens Balu
5
కలెక్టరేట్
2020-10-03 15:39:31
అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు పరిహారం రెండు రోజుల్లోపు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీటి నిల్వ కు చర్యలు తీసుకుం టామన్న ఆయన సీబీఆర్ రిజర్వాయర్ కింద 10 టీఎంసీ నీటిని నిల్వచేయడానికి అవసరమైన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు కు ప్రభుత్వం రూ. 240.53 కోట్ల ను మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం సిసి రేవు, మర్రిమాకులపల్లి గ్రామాలకు, ముదిగుబ్బ మండలం పిసీరేవు, రాఘవపల్లి గ్రామాలకు చెందిన 1729 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నామన్నారు. నిర్వాసితుల కు వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతోందన్నారు.ఇందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నామని, రెండు రోజుల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియని పూర్తి చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిహారం అందజేసిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీరు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.