బాలాజి రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తాం..
Ens Balu
2
Tirumala
2020-10-03 18:26:37
తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తులకు నీటి అవసరాల కోసం బాలాజి రిజర్వాయర్ నిర్మించేందుకు కేంద్రం తరఫున సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌ను శనివారం కేంద్రమంత్రివర్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ బాలాజి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపితే పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు కింద నిధులు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపాదికన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి సంయుక్తంగా బాలాజి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక పంపితే కేంద్రం తరఫున సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, వాటర్ వర్క్స్ ఇఇ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.