మార్చి31 నాటికి సచివాలయాలు పూర్తికావాలి..


Ens Balu
5
కొత్తపల్లి
2020-10-03 19:36:21

 నిర్మాణంలో ఉన్నరైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్ర కేంద్రాలు, గ్రామ సచివాలయాలు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు  వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  శనివారం  కశింకోట మండలం కొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు.  ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ  సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సంధర్బంగా  సచివాలయాల పనితీరుపై  విశ్లేషణ చేస్తున్నట్లు తెలిపారు.  ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు తీసుకోవలసిన చర్యలు పై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రతి సచివాలయంనకు 2 కంప్యూటర్లు, ప్రింటరు, లామినేషను మిషను, కుర్చీలు, అల్మారాలు సరఫరా  చేయడమైనదని తెలిపారు. సచివాలయాలలో కల్పిస్తున్న మౌళిక సదుపాయాలను పరిశీలించుటకు ప్రతివారం ఒక మండలం తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.   సచివాలయాల ద్వారా 543 సేవలు  అందిస్తున్నామని, సచివాలయ ఉద్యోగులంతా చురుకుగా పనిచేసి ప్రజలకు మంచి సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.   సచివాలయాల ద్వారా అందించే ప్రతి పని  నిర్ణీత సమయంలో  పూర్తిచేయాలన్నారు.  సచివాలయంలో అందించే సేవలలో  రేషనుకార్డు, ఫించన్లు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థల పట్టాలకు సంబంధించిన సమస్యలను అధిక ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని తెలిపారు.    జిల్లాలో  గ్రామీణంలో 739, అర్బన్ లో 602  మొత్తం 1341  సచివాలయాలు ఉన్నాయని తెలిపారు. 350 కోట్ల రూపాయలతో 558 గ్రామ ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.   జిల్లాలో 702 రైతు భరోసా కేంద్రాలు, 712 సచివాలయాలు, 558 గ్రామ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని  వాటిని మార్చి 31 నాటికి పూర్తిచేయనున్నట్లు తెలిపారు.   సచివాలయాలలో  మొదటి విడతలో నియామకాల తరువాత ఖాళీగా గల ఉద్యోగాలకు రెండవ విడత నియామక పరీక్షలు నిర్వహించడం జరిగిందని త్వరలోనే వాటి ఫలితాలు వెలువడుతాయన్నారు.   కోవిడ్-19 వ్యాధి జిల్లాలో తగ్గు ముఖం పట్టిందని ప్రస్తుతం 6 లేక 7 శాతం కేసులు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపారు.  గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో వ్యాధి వ్యాప్తి చెందుతున్నదని ప్రజలు తప్పని సరిగా  మాస్కు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.