ఉన్నత విద్యకు ఉదారంగా రుణాలు..


Ens Balu
2
Srikakulam
2020-10-03 19:38:42

ఉన్నత విద్యకు ఉదారంగా రుణాలు అందిస్తామని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) విశాఖపట్నం మాడ్యూల్ డిప్యూటి జనరల్ మేనేజర్ (డిజిఎం) కె.రంగనాథ్ తెలిపారు. నీట్, జెఇఇ, ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్ధలలో అర్హత సాధించి ఆర్థిక స్థోమత కారణంగా ఎవరూ చేరకుండా ఉండి పోవలసిన అవసరం లేదని అన్నారు. అర్థిక స్ధోమత తక్కువగా ఉన్న అర్హత సాధించిన విద్యార్ధులకు ఉదారంగా విద్యా రుణాలు అందించుటకు ఎస్.బి.ఐ సిద్ధంగా ఉందన్నారు. విద్యా రుణాలలో 99 శాతం మేర ఎస్.బి.ఐ అందిస్తుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళం పర్యటనకు శని వారం విచ్చేసిన డిజిఎం పలు శాఖలను తనిఖీ చేసారు. జిల్లా పరిషత్ ఎస్.బి.ఐ శాఖను తనిఖీ చేసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజియన్ నుండి విశాఖపట్నం ఎస్.బి.ఐ మాడ్యూల్ కు 35 శాతం వ్యాపారం జరుగుతోందని రంగనాథ్ తెలిపారు. విశాఖపట్టణం మాడ్యూల్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ వరకు 8 రీజియన్లు, 250 శాఖలు పనిచేస్తున్నాయని వివరించారు. దేశంలో120 మాడ్యూల్స్ ఉండగా విశాఖపట్నం మాడ్యూల్ ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని చెప్పారు. డిజిటలైజేషన్, ఎన్.పి.ఏ పెండెన్సి, అడ్వాన్సులు మంజూరు తదితర విభాగాలలో ముందువరసలో ఉందని తెలిపారు. విశాఖ మాడ్యూల్ లో రూ.30 వేల కోట్ల అడ్వాన్సులు ఉండగా శ్రీకాకుళం రీజియన్ లో రూ.10 వేల కోట్లు ఉన్నాయని, డిపాజిట్లలో రూ.55 వేల కోట్లు ఉండగా శ్రీకాకుళం రీజియన్ నుండి రూ.21 కోట్లు ఉన్నాయని తెలిపారు. విశాఖ మాడ్యూల్ కు శ్రీకాకుళం వెన్నుదన్నుగా నిలుస్తోందని పేర్కొంటూ మొత్తం వ్యాపారంలో 35 శాతం శ్రీకాకుళం రీజియన్ నుండి వస్తోందని వివరించారు. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఎస్.బి.ఐలో డిపాజిట్ చేస్తున్నారని, ఎస్.బి.ఐ మ్యూచువల్ ఫండ్, ఎస్.బి.ఐ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్సు రంగాలు మంచి ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా ప్రకటించిన మారటోరియం కాలంలో వడ్డీ వెసులుబాటు కల్పించుటకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎస్.బి.ఐ ఖాతాదారులు చక్కటి సహకారం అందించారని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం క్రింద ఖాతాదారులకు 20 శాతం మేర గ్యారంటీడ్ లోన్ కల్పించామని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు ఎస్.బి.ఐ చక్కటి సహకారం అందించిందని చెప్పారు. విశాఖ కెజిహెచ్ కు కోవిడ్ సమయంలో 4 వెంటిలేటర్లు పంపిణీ చేసామని, సింహాచలం ఆలయానికి భక్తుల సేవలకు గాను ఒక బస్సును అందించామని చెప్పారు. శ్రీకాకుళంలోగల బెహరా మనోవికాస కేంద్రానికి రెండు ఫిట్ నెస్ సైకిళ్ళను అందించామని, మిని బస్సు అందించాలని కోరారని అందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ నివారణకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం కలెక్టర్ జె నివాస్ ఆధ్వర్యంలో చక్కగా పనిచేసిందని ఆయన అభిందించారు. మంచి చర్యలు చేపట్టడం వలన కోవిడ్ నియంత్రణకు అడ్డుకట్ట వేసారని చెప్పారు. బ్యాంకులను కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతించడం వలన కోవిడ్ వ్యాప్తి నివారణకు సహకరించారని చెప్పారు. ఖాతాదారులు వెయ్యి రూపాయల వరకు నాణేలను బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చని, చిరిగిన నోట్లను మార్పు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేసారు. ప్రధాన బ్రాంచిలో అధిక రద్దీ తగ్గించుటకు, సీనియర్ సిటిజన్లకు త్వరితగతిన సేవలను అందించుటకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఏ.వి.ఎస్.ఎస్.ప్రసాద్, ఎం.బదరీనాథ్, వెంకట రమణ, కిరణ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.