మాస్కు ధరించని వారిలో అధిక పాజిటివ్ లు..


Ens Balu
2
Srikakulam
2020-10-04 16:50:19

శ్రీకాకుళం జిల్లాలో మాస్కు ధరించని వారిలొనే పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి ఉంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కు ధారణపై ఇంకా అలక్ష్యం వహిస్తున్నారని ఆయన చెప్పారు. పాజిటివ్ కేసులను విశ్లేషణ చేస్తే మాస్కు ధరించని వారికే ఎక్కువగా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తుందని అన్నారు.  కోవిడ్ కంటైన్మెంట్ జోన్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ ఆదివారం సమీక్షించారు. కంటైన్మెంట్ జోన్లను పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. జోన్లలో కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని, ఫస్ట్, సెకండరీ కాంటాక్ట్ లకు నమూనాలు తీసి పరీక్షించాలని చెప్పారు.  మెలియాపుట్టి, పాతపట్నం, నందిగాం తదితర ప్రాంతాలతో సహా గ్రామీణ ప్రాంతాల కూడలి ప్రదేశాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మాస్కు ధారణ జరగాలని ఆయన పేర్కొన్నారు. మాస్కుతో పాటు తరచూ చేతులను సబ్బుతోగాని, శానిటైజర్ తో గాని శుభ్ర పరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కోవిడ్ వైరస్ ను జిల్లా నుండి పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్ గుండాల, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, శ్రీకాకుళం ఆర్డిఓ ఐ కిషోర్, నగర పాలక సంస్థ కమీషనర్ పల్లి నల్లనయ్య, ఆరోగ్య అధికారి ఎం.వెంకట రావు, ప్రత్యేక అధికారి ప్రసాద్, తహసీల్దార్ వై.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.