అనంతలో తగ్గుతున్న కరోనా వైరస్..


Ens Balu
2
Anantapur
2020-10-04 20:38:35

అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుతోందని, 97 శాతంపైగా రికవరీ రేటు నమోదు అయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే అతి తక్కువగా 1362 పాజిటివ్ కేసులు మాత్రమే యాక్టివ్ లో ఉన్నాయని, అన్ని జిల్లాల కంటే జిల్లాలో యాక్టివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఓవరాల్ గా  పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా రికవర్ రేటు అత్యధికంగా ఉండడంతో యాక్టివ్ కేసులు అతి తక్కువగా ఉన్న జిల్లా మనదన్నారు. జిల్లాలో 97 శాతంపైగా రికవరీ రేటు నమోదు కాగా, కేవలం 2 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎంతమందికి టెస్టులు చేస్తే ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనే దానిపై కూడా పరిశీలన చేయడం జరిగిందన్నారు. అన్ని పట్టణ ప్రాంతాలలో కలిపి ఇప్పటివరకు దాదాపుగా 16 శాతం పాజిటివిటి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాలలో 9 శాతం పాజిటివిటి వచ్చిందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రెండూ కలుపుకుంటే 12 శాతం పాజిటివిటి జిల్లాలో నమోదైందన్నారు. ఇది మార్చి నుంచి ఇప్పటి వరకూ ఓవరాల్ గా నమోదయిన పాజిటివిటి శాతం అని, ఆగస్టు నెలలో 19 శాతానికి పైగా పాజిటివ్ నమోదుకాగా, గడిచిన ఒక నెల పాజిటివిటి తీసుకుంటే సెప్టెంబర్ నెలలో 10 లోపలే పాజిటివిటి వచ్చిందన్నారు. అక్టోబర్ మొదటి నుంచి తీసుకుంటే 5, 6 శాతం లోపలే  పాజిటివిటి ఉందన్నారు. జిల్లాలో కరోనా కేసులు చాలామటుకు తగ్గుతున్నాయన్నారు.  రాష్ట్రం యావరేజి కన్నా జిల్లాలో మరణాల శాతం కూడా 1 శాతంకన్నా తక్కువగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం జిల్లాలో పాఠశాలలను ప్రారంభం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.