చిత్రావతి నిర్వాసితులకు త్వరలోనే పరిహారం..
Ens Balu
1
Dharmavaram
2020-10-04 21:18:29
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆదివారం ధర్మవరం తహశీల్దార్ కార్యాలయంలోని ఎపి.ఎన్.జిఓ భవనంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద ముంపునకు గురయ్యే గ్రామాల పరిహారంనకు సంబంధించి అధికారులు చేపట్టిన ప్రక్రియను మరియు అందుకు సంబంధించిన రికార్డులను ధర్మవరం ఆర్ డి ఓ మధుసూదన్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీబీఆర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం కోసం రూ. 240.53 కోట్లను మంజూరు చేసిందన్నారు. తాడిమర్రి ,ముదిగుబ్బ మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో పరిహారం చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. .చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం సిసి రేవు, మర్రిమాకులపల్లి గ్రామాలకు, ముదిగుబ్బ మండలం పిసీరేవు, రాఘవపల్లి గ్రామాలకు చెందిన 1729 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నామన్నారు.
నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నామని, రెండు రోజుల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియని పూర్తి చేస్తామన్నారు. పరిహారం అందజేసిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీరు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ నేతృత్వంలోని అధికారుల బృందం రాత్రింబవళ్ళు టీం వర్క్ తో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.