నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-05 13:38:08
రైతులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకే మీటర్లు బిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. వీటివల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ఎపిఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలను, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రైతుకు క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వ సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా 9 గంటల పాటు ఇవ్వడానికే, పంపుసెట్లకు మీటర్లను బిగించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల విద్యుత్ ఎంత వినియోగం అవుతుంది, ఎంతమేరకు వృథా అవుతోంది, ఎన్ని గంటలు సరఫరా అవుతుంది లాంటి వివరాలు తెలుస్తాయన్నారు. వినియోగించిన విద్యుత్‌కు రైతు ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలవారీ బిల్లులను ప్రభుత్వమే రైతు ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.
ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ బి.రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ మీటర్లు అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ ఎన్నిగంటలు సరఫరా అవుతోంది, ఎంత వినియోగం అవుతోంది, సర్వర్లపై ఎంత భారం పడుతోంది తదితర వివరాలన్నీ నమోదవుతాయన్నారు. దీనివల్ల సరఫరాలో నాణ్యతను మరింతగా పెంచవచ్చని చెప్పారు. అలాగే సరఫరా చేసిన విద్యుత్‌కు తగిన ఛార్జీలను ప్రభుత్వం నుంచి తీసుకొనేందుకు సంస్థకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని, రైతులనుంచి ధరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఎపిఇపిడిసిఎల్ సూపరింటిండెంట్ ఇంజనీర్ వై.విష్ణు మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 43వేల విద్యుత్ కనక్షన్లు ఉన్నాయన్నారు. మీటర్లు బిగించడం వల్ల రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు తీరును వివరించారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.ఆశాదేవి మాట్లాడుతూ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతుకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు ఒక కమిటీగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో ఈ పథకంపై రైతులకు అవగాహణ కల్పిస్తారని చెప్పారు. అవగాహనా సదస్సులో ఎడిఇలు, డిఇలు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.