ప్రజాసేవలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు..
Ens Balu
1
పోట్లమర్రి సచివాలయం
2020-10-05 15:15:59
సచివాలయాలనికి వచ్చే సర్వీసులకు సంబంధించి ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కారం చూపించాలని, ఎలాంటి ఆలస్యం చేయరాదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో ఉన్న బత్తలపల్లి-3 గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటివద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీదారులను గౌరవించాలని, వచ్చిన సర్వీసులకు పరిష్కారం చూపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సచివాలయం లో వచ్చిన 850 సర్వీసులకు సంబంధించి పూర్తిగా అన్ని సర్వీసులకు పరిష్కారం చూపించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై కూడా ఇలాగే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల హాజరు పట్టికను, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో భార్గవ్ సాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయినికిత, వాలంటీర్లు పాల్గొన్నారు.