రక్తదానం ప్రాణదానంతో సమానం..
Ens Balu
2
Srikakulam
2020-10-05 15:22:52
శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, ఇటువంటి పరిస్థితిల్లో కార్మిక రంగం చేసే రక్తదానమే కీలకమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభిప్రాయపడ్డారు. సోమ వారం ఉదయం స్థానిక సి.ఐ.టి.యు కార్యాలయంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅ తిథిగా పాల్గొని రక్తదాతలకు ధృవీకరణ పత్రాలు, రక్తదానంలో విశేష సేవలు అందించిన దాతలకు పతకాలను బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన కార్మికులను ఆయన అభినందించారు. పారిశ్రామిక రంగం అన్నింటా కీలకమైందని, అటువంటి పారిశ్రామిక రంగ కార్మికులు రక్తదానం చేస్తే జిల్లాలో రక్త నిల్వలు పూర్తిగా నిండిపోతాయని చెప్పారు. కాని ఎందుకో కార్మికులు చొరవ తీసుకోవడం లేదని, ఆ దిశలో ఇదొక మార్పుగా తాను భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు, విపత్తులు జరిగే సమయంలో రక్తం చాలా అత్యవసరమని, దాతలు అందించే రక్తమే వారి ప్రాణాలను నిలుపుతోందని పేర్కొన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అయినప్పటికీ ఇక్కడి ప్రజలు అందించే సహకారం మరువలేనిదని కొనియాడారు. కరోనా నేపధ్యంలో జిల్లా యంత్రాంగం చేసే నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్ధతును ఇస్తూ తమ సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందించి దేశంలోనే క్రమశిక్షణగా నిలిచారని కితాబిచ్చారు. కరోనా నివారణకై 67లక్షల రూపాయలను కరోనా నిధికి జిల్లావాసులు అందించారని, ఇది గర్వకారణమని తెలిపారు. అలాగే కరోనా తీవ్రస్థాయిలో ఉన్నవారి కోసం ప్లాస్మా థెరఫీ అవసరమని పిలుపునివ్వగా సుమారు 200 మంది ముందుకు వచ్చి ప్లాస్మాను అందించిన సంగతిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేసారు. తద్వారా కరోనాతో ఐసియులో ప్రతీ పేషెంటుకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్లాస్మాను అందించడం జరిగిందని చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు జిల్లాలో జరిగేందుకు ప్రజల క్రమశిక్షణే ఇందుకు కారణమని కలెక్టర్ అభివర్ణించారు. కరోనాను నివారించేందుకు చాలా చర్యలు చేపడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులను ధరించకపోవడం వలన కరోనాకు గురవుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరించాలని, విధిగా శానిటైజేషన్ చేసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ మరోమారు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ప్రజలతో మమేకమై పటిష్ఠమైన చర్యలు తీసుకోవడం వలనే కరోనాను నియంత్రించగలిగారని చెప్పారు. సిఐటియు తరపున మేడే రోజున 700 యూనిట్ల వరకు రక్తదానం చేస్తున్న సందర్భంగా ప్రతీ ఏటా రాష్ట్ర గవర్నర్ నుండి అవార్డులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని రక్తదానం చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కరోనా పేషెంట్లకు అవసరమైతే ప్లాస్మాను దానం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. 365 రోజులు రక్తదానం చేసేందుకు సిఐటియు అన్నివిధాల కృషి చేస్తుందని కలెక్టర్ కు వివరించారు. తొలుత రక్తదానం చేసేందుకు విశేష కృషి చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ నుండి రెడ్ క్రాస్ పతకాన్ని ఆయన అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సురేష్ బాబు, పి.తేజేశ్వరరావు, ట్రెజరర్ ఎ.సత్యనారాయణ, యన్.వి.రమణ, వై.చలపతిరావు, సిహెచ్.అమ్మన్నాయుడు, ఎ.మహాలక్ష్మీ, కె.గురునాయుడు, సిహెచ్.రమణమూర్తి , రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్యకుమార్, యస్.జోగినాయుడు , రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.