నాడు నేడు పనులు సత్వరమే పూర్తికావాలి..
Ens Balu
3
Srikakulam
2020-10-05 18:44:44
శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలంలో నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం తనిఖీ చేసారు. లింగాలవలస, అచ్యుతాపురం, శ్రీముఖలింగం పాఠశాలలో నాడు నేడు పనుల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు పక్కాగా ఉండాలన్నారు. భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, ఇతర నిర్వహణ పనులకు ఎటువంటి సమస్య లేకుండా ముందుగానే పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలకు గ్రానైట్ ను ఫ్లోరింగు కోసం వినియోగించాలని సూచిస్తూ పనుల సమయంలో గ్రానైట్ ఫ్లోరింగుపై ఎటువంటి సున్నపు మరకలు లేదా ఇతర మరకలు పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల తలుపులు, గడియలను స్వయంగా పరిశీలించి వాటి నాణ్యతపై నిర్ధారణకు వచ్చారు. నాడు నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదకరంగా మారుతున్నాయని పేర్కొంటూ ప్రతి పాఠశాలపై చిన్నారులకు ఆకట్టుకునే విధంగా, సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రాలు ఉండాలని సూచించారు. ప్రతి చిత్రం వారిలో నిఘూడంగా ఉన్న సృజనాత్మక శక్తి వెలికితీయుటకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ లేదని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి పి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజనీరు వి.వెంకట కృష్ణయ్య, మండల విద్యా శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.