ప్రత్యామ్నాయ పంటలు వేయించాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-05 20:19:22
విజయనగరం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరవు పరిస్థితులు ఉన్న మండలాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు వీలుగా అవసరమైన విత్తనాలు అందుబాటులో సిద్ధంగా ఉంచాలని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ శాఖ జె.డి.ని ఆదేశించారు. జిల్లా ఎమ్మెల్యేలతో కలసి మంత్రి సోమవారం కలెక్టర్ ఛాంబరులో పంటల పరిస్థితిపై సమీక్షించారు. వ్యవసాయ శాఖ జె.డి. ఆశాదేవి మాట్లాడుతూ స్వల్పకాలిక వరి రకాలను, అపరాల విత్తనాలను రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉంచామని, రైతులు అపరాల పంటల విత్తనాలపైనే ఆసక్తి చూపుతున్నారని వివరించారు. దీనిపై రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలోని గరివిడిలో ఏర్పాటు చేసిన పశువైద్య కళాశాల తరగతులు ప్రారంభించేందుకు అన్ని అనుమతులూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని వచ్చే నెల నుండి కళాశాల ప్రవేశాలు కూడా చేపడుతున్నట్టు కళాశాల అసోసియేట్ డీన్ డా.వెంకటనాయుడు మంత్రికి వివరించారు. కళాశాల భవనాల నిర్మాణం పూర్తయ్యాయని ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రితో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని, వీలు కాకపోతే తాను ప్రారంభానికి వస్తానని మంత్రి బొత్స తెలిపారు.
నగరంలోని జె.ఎన్.టి.యు.ను పూర్తిస్థాయి యూనివర్శిటీగా ఏర్పాటు చేస్తూ జె.ఎన్.టి.యు.-విజయనగరం పేరుతో ఏర్పాటు చేయనున్నారని, ఇందుకు మరికొంత స్థలం సమకూర్చాల్సి వుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో, జె.ఎన్.టి.యు. పరిసరాల్లో ప్రభుత్వ భూమి లభ్యతపై జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, తహశీల్దార్ లు మంత్రికి వివరించారు. నగరంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని వీలు చూసుకొని ప్రారంభించాలని ఛైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు జిల్లా కలెక్టర్ ద్వారా మంత్రిని కోరారు. త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో శాసనసభ్యులు శంబంగి చినప్పల నాయుడు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్లు జి.సి.కిషోర్ కుమార్, జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.