ఉపాది పనులు ఉద్రుతం చేయాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-05 20:21:17
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను ముమ్మరం చేయాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కన్వర్జెన్సీ పనుల ప్రగతిని వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం ప్రస్తుతం గ్రామాల్లో భారీ ఎత్తున జరుగుతోందన్నారు. అన్ని భవనాలకు అవసరమైన స్థలాలను ఇప్పటికే కేటాయించడం జరిగిందన్నారు. ఇవి కాకుండా రోడ్లు, కాలువల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి బొత్స సత్యానారాయణ సమీక్షించారు. ఆయా పనుల పరిస్థితిని, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి రూ.10కోట్లుకు తక్కువ కాకుండా వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. దీనికోసం ఇంజనీర్లు ఆయా నియోజకవర్గ ఎంఎల్ఏలతో కూర్చొని, మంగళవారం సాయంత్రం లోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జిల్లాలో మార్చిలోగా సుమారు రూ.400 కోట్లు విలువైన పనులను పూర్తి చేయాలని, దానికి తగ్గ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా ఈ డిసెంబరు నాటికి సుమారు రూ.200కోట్లు విలువైన పనులు చేయాలని స్పష్టం చేశారు. ఐటిడిఏ మండలాల్లోని పనులన్నీ ఐటిడిఏ పీఓ పర్యవేక్షించాలని ఆదేశించారు. మిగిలిన పనులకు పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బిల్లులు సకాలంలో చెల్లించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికరంగా వర్షాలు కురిసినప్పటికీ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని చెప్పారు. కరువు పరిస్థితులు ఉత్పన్నం కావడంతో, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉపాధి పనులను ఉధృతం చేయాలని సూచించారు. అలాగే కరువు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు అవసరమైన విత్తనాలను కూడా సిద్దం చేశామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, నాడూ-నేడు పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన బిల్లులు కూడా రెండుమూడు రోజుల్లో మంజూరవుతాయని తెలిపారు. పెండింగ్ ఉన్నచోట వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఇసుక, సిమ్మెంటుకు సమస్య రాకుండా చూడాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో శాసన సభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, డ్వామా పిడి ఏ.నాగేశ్వర్రావు, పిఆర్ ఎస్ఇ గుప్త, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, ఇతర శాఖల అధికారులు, ఇఇలు, డిఇలు తదితరులు పాల్గొన్నారు.