మౌళిక సదుపాయాలకు పెద్దపీట..
Ens Balu
4
Vizianagaram
2020-10-05 20:23:06
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన, ఎంఎల్ఏలతో కలిసి మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా జిల్లాలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్ష చేయడం జరిగిందన్నారు. మార్చి నాటికి సుమారు రూ.400 కోట్ల ఉపాధిహామీ కన్వర్జెన్జీ నిధులను వినియోగించి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ భవనాలు, నాడూ-నేడు పనులను పూర్తి చేయడంతోపాటుగా, రహదారులు, కాలువల నిర్మాణానికి కూడా ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రాంతాలతోపాటుగా, నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని మారుమూల, గిరిజన ప్రాంతాల అభివృద్దిపైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు. జిల్లాలో కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు సుమారు 5వేల వరకూ నిర్ధారణా పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదట్లో పాజిటివ్ కేసుల సంఖ్య సుమారుగా 18 శాతం వరకూ ఉండేదని, ప్రస్తుతం ఇది 5 శాతానికి తగ్గిందని తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు కరోనా బారిన పడ్డ సంఘటన జిల్లాలో ఇటీవల చోటుచేసుకుందని, తక్షణమే తగిన చర్యలను చేపట్టామని తెలిపారు. ఎంఆర్ కళాశాల ప్రయివేటీకరణ అంశంపై మంత్రి స్పందిస్తూ, ఆ ప్రతిపాదన అశోక్‌గజపతి హయాంలోనే మొదలయ్యిందని ప్రస్తుత ఛైర్మన్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో తానుగానీ, ప్రభుత్వం గానీ ఇంతవరకు జోక్యం చేసుకోలేదని, అశోక్‌గజపతిరాజు ఈ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగే పక్షంలో తమ జోక్యం ఉంటుందని స్పష్టం చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, స్థానిక నాయకులందరితో కలిసి చర్చించిన తరువాతే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ అన్నారు.