సేవల్లో జాప్యాన్ని సహించేది లేదు..
Ens Balu
4
Denkada
2020-10-06 19:05:41
సచివాలయాల ద్వారా అందే సేవల్లో జాప్యానికి తావుండకూడదని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ స్పష్టంచేశారు. ఏ దరఖాస్తు ప్రజల నుండి అందినా వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిందేనని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఇ-దరఖాస్తుల పరిష్కారంపై మండలస్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. డెంకాడ మండలం చింతలవలస గ్రామ సచివాలయాన్ని మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, బియ్యం కార్డుల మంజూరు, చేయూత, చేదోడు పథకాలు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సచివాలయం ద్వారా అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయానికి అందిన దరఖాస్తుల్లో పరిష్కరించినవి ఎన్ని, ఇంకా పరిష్కారం కానివి ఎన్ని తదితర వివరాలపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. సచివాలయ ఇ-రిక్వెస్టు యాప్ ద్వారా ఎనిమిది వినతులు గడువు ముగిసినా వాటి పరిష్కారంపై ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారని, ఆ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని సచివాలయ సిబ్బందికి హితవు చెప్పారు. సచివాలయంలో పంపిణీ కాకుండా వున్న ఆరోగ్యశ్రీ కార్డులను పరిశీలించి కార్డుకు దరఖాస్తు చేసుకొన్న గ్రామానికి చెందిన గిరిబాబు అనే వ్యక్తికి ఫోన్ చేశారు. కార్డు మంజూరైనప్పటికీ ఎందుకు తీసుకువెళ్లలేదని ఫోన్‌లోనే ఆయన్ను ప్రశ్నించారు. తగిన సమాచారం లేక రాలేకపోయానని ఆయన బదులివ్వడంతో కార్డు సిద్ధంగా ఉందని, సచివాలయానికి వస్తే అందజేస్తామని చెప్పడంతో గిరిబాబు వెంటనే సచివాలయానికి చేరుకొని కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డు అందుకున్నాడు. సచివాయలంలో సిబ్బంది అందరూ తమ గుర్తింపుకార్డులను తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయంలో తగినంత ఫర్నిచర్ అందుబాటులో ఉన్నదీ లేనిదీ తెలుసుకున్నారు. సచివాలయంలో ఫర్నిచర్ అవసరం మేరకు సరఫరా చేసిందీ లేనిదీ తెలుసుకన్నారు. డిజిటల్ అసిస్టెంట్ పనివిధానం గురించి ఆరా తీశారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4 లక్షల ఇ-సర్వీసు రిక్వెస్టులు వచ్చాయని, వీటిలో 3.40 లక్షలు నిర్ణీత గడువులోగా పరిష్కరించారని, మరో 60వేలు గడువు దాటాక పరిష్కరించమన్నారు. ఎంపిడిఓ స్వరూపరాణి, తహశీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.