12 చక్కెర కర్మాగారాలకు ఊపిరి..


Ens Balu
3
Payakaraopeta
2020-10-06 19:15:05

రాష్ట్రంలో నష్టాలలో ఉన్న 12 సహకార చక్కెర కర్మాగాలను పునరుద్థరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్థి శాఖామాత్యులు, రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక  సహకార చక్కెర కర్మాగారాలను ఉప సంఘం మంగళవారం సందర్శించి అక్కడి రైతులు, కార్మికులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారాలను సందర్శించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.  గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని, ఇందులో తాండవ ఫ్యాక్టరీకి 9 కోట్ల రూపాయలు, ఏటికొప్పాక ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించి కర్మాగారాలను పునరుద్థరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు ఆయన వివరించారు. కర్మాగారాలకు పూర్వవైభవం తీసుకురావడానికి కార్మికులు, రైతులు భాగస్వాములవ్వాలన్నారు.  ఒక లక్షా పది వేల టన్నులు చెఱకు ఆడే కర్మాగారం  64 వేల టన్నులకు పడిపోవడానికి కారణం గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడమేనని తెలిపారు.  రైతులు పంటను తిరిగి యధా స్థితిలో పండించి ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.  కర్మాగారం పనిచేయడం వలన అనుబంధ పరిశ్రమలు, వారి కుటుంబాలు లబ్దిపొందుతాయన్నారు.  రాష్ట్ర వ్యవసాయశాఖ, మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ  గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఈ కర్మాగాలు మూతపడ్డాయని, సహకార చక్కెర కర్మాగారాలను పరశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12 పరిశ్రమలకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చి తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  లాభనష్టాలతో ప్రమేయం లేకుండా చెరకు రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.  12 చక్కెర కర్మాగారాలను కాపాడుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటి సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించడానికి చిత్తశుద్థితో ఉన్నారని, ప్రారంభించడమే కాని మూసివేయడం ఉండదన్నారు. రాష్ట్రంలో 12 పరిశ్రమలకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చి తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  నష్టాలలో ఉన్న కర్మాగారాలపై సబ్ కమిటీ వేశారని చెప్పారు.  కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి రైతులు, కార్మికుల నుండి సూచనలు, సలహాలు తీసుకొని ప్రభుత్వానికి నివేధిక రూపంలో సమర్పిస్తామన్నారు.   కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా నుండి రెండు కర్మాగారాలను మూసివేయడమైనదని, ఆ ప్రాంతంలో పండించే చెఱకును తాండవ సహకార చక్కెర కర్మాగారం వారు తీసుకొనుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  తుని నియోజకవర్గ శాసన సభ్యులు దాడిశెట్టి రాజా, పత్తిపాడు శాసన సభ్యులు హరిచంద్ పూర్ణ ప్రసాద్, పాయకరావు పేట, అనకాపల్లి, నర్సిపట్నం శాసన సభ్యులు గొల్ల బాబురావు, గుడివాడ అమర్ నాథ్, ఉమా శంకర గణేష్లు మాట్లాడుతూ సహకార చక్కెర కర్మాగారాలు నడిపించి రైతులను ఆదుకోవాలని కోరారు. కర్మాగారం కార్మికులు మాట్లాడుతూ కర్మాగారం ప్రారంభించడానికి తమవంతు సహకార అందిస్తామని, కర్మాగారం తెరిపించాలని కోరారు. కర్మాగారం నిర్వహణ చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చాలని కోరారు. రైతులు మాట్లాడుతూ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్.ఆర్.ఇ.జి.యస్. పథకానికి చెఱకు పంట సాగు అనుసంధానం చేయాలని కోరారు.  ఇథనాల్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి అయిన చక్కెరకు మార్కెటింగ్ కల్పించాలన్నారు.  చెఱకు పంటకు కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నదని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.   ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్  నారాపురెడ్డి మౌర్య, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు