అభివ్రుద్ధి పనులు వేగవంతం చేయాలి..
Ens Balu
3
Anantapur
2020-10-06 19:17:05
అనంతపురం జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసి భవనం నుంచి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, సమగ్ర శిక్ష, ఆర్ అండ్ బి శాఖ ల పరిధిలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని మండలాల ఇంజనీరింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రైతు భరోసా కేంద్రాల భవనాలు, గ్రామ/ వార్డు సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, అంగన్ వాడి భవనాల నిర్మాణం, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి పనులు, సిసి డ్రెయిన్లు, సీఎండిఎఫ్, డిఎంఎఫ్ మరియు రహదారుల నిర్మాణాల్లో పురోగతి కనిపించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే మొదలైన అన్ని రకాల అభివృద్ధి పనులను నిర్ణయించిన సమయం లోపు వంద శాతం పూర్తిచేయాలన్నారు. ఇంతవరకు మొదలుకాని పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి వారం ఎంత పని చెయ్యాలో లక్ష్యాలను నిర్ణయించుకుని ఆ మేరకు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేలా చూడాలన్నారు. ఆయా అభివృద్ధి పనుల్లో సిమెంట్ సమస్యలు ఏవైనా ఎదురైనా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పని చేసి వాటిని అధిగమించి త్వరితగతిన పనులు పూర్తి పై శ్రద్ధ పెట్టాలని జిల్లాలోని అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులను జేసీ ఆదేశించారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున అధికారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. జిల్లాకు భారీ వర్షాల ప్రభావం కూడా తగ్గిపోయింది కాబట్టి ఇసుక కొరత కూడా ఉండబోదనీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలకు నిధుల కొరత కూడా లేనందున వీలైనంత తొందరగా పనులు పూర్తిచేయాలని కోరారు.