2.93 లక్షల మందికి జనగన్న విద్యాకానుక..
Ens Balu
2
Vizianagaram
2020-10-07 13:32:19
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి విద్యార్థులకు ప్రకటించిన విద్యాకానుక పంపిణీని నేడు లాంఛనంగా కృష్ణాజిల్లాలో ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా గురువారం నుంచే విద్యాకానుక పంపిణీ ప్రారంభం కానుంది. ఏడు రకాల వస్తువులతో కూడిన కిట్లను ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ చేర్చారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలనూ తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రతీరోజూ ఉదయం 25 మంది విద్యార్థులకు, మధ్యాహ్నం 25 మందికి మాత్రమే పంపిణీ చేస్తారు. విద్యార్థితోపాటు తల్లితండ్రులు కూడా పాఠశాలలు వెళ్లాల్సి ఉంటుంది. కానుక తీసుకొనే విద్యార్థి తల్లి బయోమెట్రిక్‌ను లేదా ఐరిస్‌ను తప్పనిసరిగా నమోదు చేస్తారు. గతంలో విద్యార్థులు యూనిఫారాలు కోసం ఆ విద్యాసంవత్సరమంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలోనైతే ఏకంగా మూడేళ్లపాటు యూనిఫారాల పంపిణీయే జరగలేదు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సామగ్రి, పుస్తకాలు వారి చేతికి అందుతుండటం విశేషం. జిల్లాలోని 2,803 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2,09,345 మంది విద్యార్థులకు ఈ కిట్లను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరిలో 1,01,353 మంది బాలురు, 1,07,992 మంది బాలికలు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.1530 విలువైన కిట్‌ను అందిస్తున్నారు. దీని ప్రకారం జిల్లాలో రూ.32.03కోట్ల రూపాయల విలువైన విద్యాకానుకలు విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. చీపురుపల్లిలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి చేతులమీదుగా గురువారం విద్యాకానుక పంపిణీ ప్రారంభం అవుతుంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అక్కడి ఎంఎల్ఏలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జగనన్న విద్యాకానుక క్రింద ప్రతీ విద్యార్థికి ఒక స్కూలు బ్యాగు, మూడు జతల యూనిఫారాలు, ఒక బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, నోటుపుస్తకాలు, పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. ఏయే తరగతి విద్యార్థులకు ఏవి, ఎన్ని ఇవ్వాలో కూడా ప్రభుత్వం నిర్ధేశించింది. విద్యాకానుకకు సంబంధించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 9121296051, 9121296052 టోల్‌ఫ్రీ నెంబరుకు సంప్రదింవచ్చు.