పాఠశాలల్లో ఆట పరికరాలు ఏర్పాటు చేయండి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-07 14:50:29

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆట పరికరాలను ఏర్పాటు చేయాలని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. నాడు–నేడు పనులపై బుధవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత కార్యనిర్వాహక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ.  పనులు పక్కాగా జరగాలన్నారు. గ్రానైట్, టైల్స్ ను మాత్రమే వినియోగించాలని, గోడలకు పుట్టీలు పెట్టినపుడు ఫ్లోరింగుపై మరకలు ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తరగతి గది నుండి మరుగుదొడ్ల వరకు వెళ్ళే మార్గంలో పార్కింగు టైల్స్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. తలుపులు, కిటికీలకు నాణ్యమైన గడియలు వినియోగించాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ లేదని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో నాడు నేడు మొదటి దశ పనుల క్రింద   1249 పాఠశాలలకు పనులు మంజూరు కాగా 1215 పాఠశాలల్లో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పనులను చేపట్టుటకు రూ.293.75 కోట్లతో అంచనాలు తయారు చేశామన్న జెసి సమగ్ర శిక్షా అభియాన్ 430 పాఠశాలల్లోనూ, ఏపిఇడబ్ల్యుఐడిసి 284 పాఠశాలల్లోనూ, పంచాయతీ రాజ్ 277 పాఠశాలల్లోనూ, గిరిజన సంక్షేమ శాఖ 221 పాఠశాలల్లోనూ, మునిసిపాలిటీలు 37 పాఠశాలల్లోనూ నాడు నేడు పనులకు పర్యవేక్షణ చేస్తుంది. ఈ పాఠశాలల్లో నాడు నేడు పనుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన పనులతో పాటు తాగు నీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు,మరుగుదొడ్లకు నిరంతర నీటిసరఫరా, మరమ్మతుల నిర్వహణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా అభియాన్ సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.వి.రమణ, కార్యనిర్వహక ఇంజనీర్లు కె.భాస్కర రావు, వి.వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.