వేరుశనగ నష్టం ప్రభుత్వ ద్రుష్టికి..
Ens Balu
2
Anantapur
2020-10-07 16:24:31
అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని రైతులు తెలుపుతున్న దృష్ట్యా ఈ అంశాన్ని పరిశీలించి, వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం బత్తలపల్లి మండలం ఓబుళాపురం పంచాయితీ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద రైతు టి.రామాంజనేయులుకు చెందిన పొలంలో వేరుశనగ పంట కోతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వేరుశెనగ పంట దిగుబడి విషయమై రైతు, కూలీలతో జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు అధికంగా రావడంతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని తెలిపారు. సాధారణంగా ఎకరాకు 10 - 12 బస్తాల వేరుశనగ పంట వచ్చేదని, ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా రావడం వల్ల 5-6 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేరుశనగ పంట దిగుబడి విషయమై అంచనా వేసి,నష్టం జరిగివుంటే వివరాలను ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, రైతులు కూలీలు పాల్గొన్నారు.