యుద్ధప్రాతిపదికన చిత్రావతి నష్టపరిహారం..


Ens Balu
0
Dharmavaram
2020-10-07 18:51:11

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పరిహారం చెల్లింపు ప్రక్రియను చేపడుతున్నామని, అందులో భాగంగా బుధవారం 50 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారుల ఖాతాలో నగదు అయ్యిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం ధర్మవరం తహశీల్దార్ కార్యాలయంలోని ఎపిఎన్జిఓ భవనంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద ముంపునకు గురయ్యే గ్రామాలకు సంబంధించి పరిహారం పంపిణీ కోసం అధికారులు చేపట్టిన ప్రక్రియను మరియు అందుకు సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీబీఆర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం కోసం రూ. 240.53 కోట్లను మంజూరు చేసిందన్నారు. అందుకు సంబంధించి సోమవారం నుంచి బిల్లులు సబ్మిట్ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా బుధవారం 50 కోట్ల రూపాయల వరకు సీబీఆర్ నిర్వాసితుల ఖాతాలలో నగదు జమ అయ్యిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులకు డబ్బులు అందించి, వారు ముంపునకు గురవుతున్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఈ ఏడాది 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.