సిరిమాను చెట్టుకు పూజలు..
Ens Balu
1
బలరామపురం
2020-10-07 19:16:53
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, పిలిచిన పలికే దేవతగా కొలిచే విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి అంకురార్పణ జరిగింది. సిరిమానోత్సవానికి కీలకమైన చింత చెట్లను జామి మండలం భీమసింగి సమీపంలో బలరాంపురంలో గుర్తించారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానం పూజారులు, అధికారులు ఈ సిరిమాను చెట్టుకు సంప్రదాయబద్దంగా బుధవారం పూజలు చేశారు. బలరామపురం గ్రామానికి చెందిన పెంట సన్యాసప్పడు, పెంట తమ్మినాయుడు, పెంట అప్పలనాయుడు, పెంట ఎర్రునాయుడుల కళ్లంలో చింత చెట్లను గుర్తించి, ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో పూజారులు వేద మంత్రోచ్ఛారణలతో పూజా క్రతువును నిర్వహించారు. అమ్మవారు కలలోకి వచ్చి బలరామపురం గ్రామానికి చెందిన పెంట సన్యాసప్పడు కుటుంబానికి చెందిన కళ్ళంలో చెట్లను ఉత్సవానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించినట్లు, సిరిమాను ఉత్సవ పూజారి బంటుపల్లి వెంకటరావు వెల్లడించారు. అమ్మవారి అనుగ్రహం పెంట సన్యాసప్ప డు కుటుంబానికి, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి జి.వి.ఎస్.ఎస్.ఆర్. సుబ్రమణ్యం మాట్లాడుతూ అమ్మవారి ఆజ్ఞ మేరకు సిరిమాను, ఇరుసుమాను చెట్లను గుర్తించామన్నారు. ఈ నెల 12వ తారీఖున ఉదయం 9:15 గంటలకు సంప్రదాయాల ప్రకారం, అటవీ అధికారుల సాయంతో చెట్లను కొట్టించి, హుకుంపేటలోని ఉత్సవ పూజారి ఇంటికి తరలిస్తామని తెలిపారు. ఈ సారి ఉత్సవాలకు 60 అడుగుల సిరిమాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్నిరకాల ముందు జాగ్రత్తలూ తీసుకొని ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సిరిమాను చెట్ల దాతలు పెంట సన్యాసప్పడు కుటుంబీకులు మాట్లాడుతూ పైడితల్లమ్మవారి అనుగ్రహం కలగటం తమ అదృష్టమని పేర్కొన్నారు. తమ కళ్లం చెట్లను గుర్తించటం తమతోపాటు, గ్రామంలోని వారికి కూడా ఎంతో ఆనందంగా ఉంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు డి.రామారావు, కె.రమణ మూర్తి, వేదపండితులు టి.రాజేష్ బాబు, ఎ.సాయికిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.