ట్రస్ట్ సేవలు శ్లాఘనీయం..
Ens Balu
2
Srikakulam
2020-10-08 13:23:19
మధర్ థెరిస్సా సిస్టర్స్ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ అభివర్ణించారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ట్ కళాశాలలోని గిరిజన యువత శిక్షణ కేంద్రంలో నర్సింగ్ శిక్షణ పొందిన రెండవ బ్యాచ్ విడుదల కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మథర్ థెరిస్సా సిస్టర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని, సహనం,ఓర్పుతో అన్ని కార్యక్రమాలు చేపడుతుంటారని కితాబిచ్చారు. ప్రతీ రోజూ తమ సంస్థ అందిస్తున్న సేవలను వెబ్ సైట్ నందు వీక్షిస్తుంటానని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో కరోనా పేషంట్లకు సేవలు అందించేందుకు నర్సులు ఆవశ్యకత ఎంతైనా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సింగ్ నందు శిక్షణ ఇచ్చిన ఆరుగురు శిక్షకులను (థెరిస్సా సిస్టర్స్) జె.సి అభినందించారు. మీరిచ్చిన శిక్షణ వలన ముందుగా ఒక బ్యాచ్ వెళ్లిందని, వారు ఇప్పటికే సేవలు అందిస్తున్నారని, అలాగే రెండవ బ్యాచ్ శిక్షణను పూర్తిచేసుకొని బుధవారం విడుదలై సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నందున ఆనందంగా ఉందన్నారు. మరో బ్యాచ్ నకు శిక్షణ ప్రారంభించడం గర్వకారణమని ఇందుకు మీరు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ కోర్సుపై రెండు బ్యాచ్ లకు శిక్షణ ఇచ్చిన సిస్టర్స్ దీపాళీ, రాఫాలిట్, జెన్నీ అగస్టైన్, క్రిష్ జాన్, మేరీ ఏంకెల్, అన్నిక్ లకు జె.సి దుశ్శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్ఛాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహశీల్ధార్ కె.సతీష్, గ్రామ రెవిన్యూ అధికారులు డి.వరలక్ష్మీ, పి.శ్రావణి, బి.రాంజీ, పర్యవేక్షకులు టి.హరిసూర్య తదితరులు పాల్గొన్నారు.