ఏపీకి మూడు రోజులు భారీ వర్ష సూచన..


Ens Balu
2
Velagapudi
2020-10-08 13:50:48

భారత వాతావరణ కేంద్రం సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు  తెలిపారు. ఆ అల్ప పీడనం  తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా  పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని కూడా కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులపాటు  రాష్ట్రంలో విస్తారంగా  మోస్తారు నుంచి భారీ వర్షాలు , పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కనుక  మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని విపత్తుల శాఖ కమీషనర్ హెచ్చరించారు.  రాగల పరిస్థితి ని ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు కోరారు.