పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య..
Ens Balu
3
Cheepurupalli
2020-10-08 14:21:49
పేదలందరికీ విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ధ్యేయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థకు ధీటుగా, ప్రభుత్వ విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చీపురుపల్లిలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పంపిణీకి మంత్రి బొత్స గురువారం శ్రీకారం చుట్టారు. వివిధ తరగతుల విద్యార్థులకు విద్యాకానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ సిద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో, ముందుగానే ప్రభుత్వం విద్యాకానుక అందజేస్తోందన్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43లక్షల మంది విద్యార్థులకు, రూ.650కోట్ల వ్యయంతో కిట్లను రూపొందించి, పంపిణీ చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలోని 2,083 పాఠశాలలకు చెందిన 2,09,345 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కిట్ విలువ సుమారుగా రూ.1530 అని తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారి కొలతలు తీసుకొని, వారికి సరిపడే యూనిఫారాలను కుట్టించి ఇస్తున్నామన్నారు.
ప్రజలకు మేలు చేయాలన్ని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మంత్రి అన్నారు. ఏ ఒక్క పేద విద్యార్థీ ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో, ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. జగనన్న విద్యాకానుకతోపాటుగా జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాలను విద్యకోసం అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా రూపొందించేందుకు నాడూ-నేడు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. చదువువల్లే ఎవరికైనా సమాజంలో మంచి గుర్తింపు, స్థాయి, స్థోమత లభిస్తుందని అన్నారు. ప్రతీ విద్యార్థీ చిన్నతనంలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, చదువు ద్వారా దానిని సాధించేందుకు కృషి చేయాలని మంత్రొ బొత్స కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ చదువు వల్లే ఏ వ్యక్తికైనా గౌరవం లభిస్తుందని అన్నారు. ఎంతో పేదరికంలో, మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ చదువుద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. చదువుకున్నవారు ఏరంగంలోనైనా ఉన్నత స్థాయికి ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యనిస్తోందని, దానిలో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యలనగరంగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా, వినూత్నంగా విద్యాకానుకను అందించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డికే చెల్లిందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో , శిధిలావస్థలో ఉండేవని, ఇప్పుడు నాడూ-నేడు పథకం ద్వారా వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. వసతులను కల్పించడంతోపాటుగా, పేదలు సైతం ఇంగ్లీషు చదువులు చదవాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధనను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను నిరంతరం ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డికే చెల్లిందని కొనియాడారు. జగనన్న విద్యాకానుక పథకంపై జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష రూపొందించిన కరపత్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు విద్యాకానుకపై నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డిఇఓ జి.నాగమణి, ఎస్ఎస్ఏ పిఓ జె.విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్‌రాజ్ కుమార్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, డిపిఎం బి.పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, స్థానిక నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, పెదబాబు, ఇప్పిలి అనంత్, ఒలిరెడ్డి శ్రీనివాసరావు, కొణిశి కృష్ణారావు, పొన్నాడ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.