ప్రతీ విద్యార్ధి ఉన్నతస్థాయికి ఎదగాలి..


Ens Balu
3
Srikakulam
2020-10-08 18:23:36

రాష్ట్రంలోని ప్రతీ విద్యార్ధి ఉన్నత చదువులు చదివి ఉన్నతస్థాయికి ఎదగాలనేదే ముఖ్యమంత్రి ధ్యేయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అందులో భాగంగానే అమ్మఒడి, విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, నాడు – నేడు వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేసారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఆ కుంటుంబానికి ఆసరా కావాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్యేయమని అన్నారు. ఆ చదువుతో కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో మన ముఖ్యమంత్రి ప్రజల బాగు కోరే విధంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కార్పొరేట్ చదువుల కోసం తల్లితండ్రులు తమ సంపాదనలో ఎక్కవగా ఖర్చుచేయాల్సివచ్చేదని, కాని నేడు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా విద్యార్ధి కోరుకున్న ఉన్నత చదువులను సైతం చదువుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిదన్నారు. విద్యార్ధులు ఆహ్లాదకర వాతావరణంలో ఉండి విద్యను అభ్యసించేవిధంగా నాడు – నేడు కార్యక్రమంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్పుచేసిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. అలాగే పాఠశాలలు తెరవకముందే విద్యార్ధులకు అవసరమైన 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్ , సాక్స్, షూస్ అందించడం జరుగుతుందని చెప్పారు. యూనిఫారాలను కుట్టించుకొనేందుకు తల్లుల ఖాతాల్లో నగదును కూడా జమచేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, 1 నుండి ఇంటర్మీడియట్  వరకు చదువుతున్న పిల్లలకు బడికి పంపే పేద విద్యార్ధుల తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నాణ్యమైన పౌష్టికాహారం, పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారికి జగనన్న గోరుముద్ద క్రింద ప్రతి రోజూ మెనూ మార్చి రుచికరమైన మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాలల్లో చదివే విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ ను కూడా అందిస్తున్న సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సువర్ణధ్యాయమని కొనియాడారు. అనంతరం విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందించారు. రానున్న వారం రోజులు పండుగలా పాఠశాలల్లో కిట్ల పంపిణీ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తొలుత రాష్ట్ర శాసనసభాపతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రానికి అభివృద్ధి పధంలో నడిపించే ముఖ్యమంత్రి మనకు ఉన్నారని కొనియాడారు. జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, జగనన్న విద్యా కానుక  ఒక అద్భుతమైన కార్యక్రమమని కితాబిచ్చారు. ఈ కార్యక్రమం వలన పేద ,బడుగు విద్యార్థుల తల్లితండ్రులకు ఎంతో ఊరట కలిగిస్తుందని, గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే ఏదో చిన్నచూపు ఉండేదని, అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రైవేట్ పాఠశాలల్లో అప్పులు చేసి మరీ చదివించేవారని తెలిపారు. కాని ఇపుడు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలకు జాయిన్ చెయ్యడానికి ఉత్సాహ పడుతున్నారని, ఎందుకంటే గతంలో చదివించాలంటే ఏడాదికి సుమారు రూ.20వేలు ఖర్చు అయ్యేదని, ఇది కాకుండా పుస్తకాలు, బట్టలు,బ్యాగు,షూ లాంటివి అధిక ఖర్చు చేయాల్సి వచ్చేదని చెప్పారు. కాని ఇపుడు జగనన్న తల్లి ఖాతాలోకి అమ్మఒడి క్రింద రూ.15వేలు,  జగన్నన్న విద్యా దీవెన కింద స్కూల్ యూనిఫామ్ ,బ్యాగు,షూ,పుస్తకాలు ఫ్రీ గా అందజేయడం జరుగుతుందన్నారు. ఇంకా నాడు – నేడు కార్యక్రమంతో పాఠశాల స్థితి గతులు పూర్తిగా మార్చేయడం జరిగిందని, ఇంత కన్నా అద్భుతం ఇంకా ఏం కావాలని సభాపతి అన్నారు. అనంతరం జగనన్న విద్యాకానుకలను విద్యార్ధులకు అందజేసారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక ద్వారా జిల్లావ్యాప్తంగా 3300 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,49,405  మందికి లబ్ధిచేకూరనుందని చెప్పారు. రానున్న వారం రోజుల్లో జిల్లాకు రూ.38.16 కోట్లు విలువ గల జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రతీ కిట్ లో ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్టు, నోటు, పాఠ్యపుస్తకాలు అందజేయడం జరుగుతుందని, యూనిఫారాలు కుట్టించుకునేందుకు తల్లుల ఖాతాలకు నగదును జమచేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, సమగ్ర శిక్షణ అధికారి  పథక సంచాలకులు పైడి వెంకటరమణ, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.