ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర విద్య..


Ens Balu
2
Hindupuram
2020-10-08 18:52:12

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా జగనన్న విద్యా కానుక కింద జిల్లాలో 3,61,488 మంది విద్యార్థులకు 3,93,262 కిట్లను పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం హిందూపురంలోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక పథకం కింద జిల్లాలో 3844 పాఠశాలలో 3,61,488 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1600 రూపాయలు ఖర్చు చేసి 63 కోట్ల రూపాయలతో కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరూ బెంగ పడాల్సిన అవసరం లేకుండా జిల్లాకు మొత్తం విద్యార్థులకు 8 శాతం అదనంగా 31,774 కిట్లు వచ్చాయని, జిల్లాకు మొత్తం 3,93,262 కిట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఒక విద్యార్థికి 3 జతల యూనిఫామ్ లు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి తేడా లేకుండా అందరికి ఒకే రకంగా 3 జతల యూనిఫారం, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ లు బెల్టులు, షూలు, సాక్సులు, స్కూల్ బ్యాగ్స్ అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని వారి సైజుకు తగినట్లుగా అన్ని సిద్ధం చేసి వారికి అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక కింద పిల్లలను చదివించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా కానుక ప్రవేశపెట్టడం జరిగిందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వారి భవిష్యత్తు బాగుంటుందని, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిశాంతి, సమగ్ర శిక్ష ఏపీసి తిలక్ విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ చెన్నుడు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంజీఎం పాఠశాల హెచ్ఎం సామ్రాజ్యం, ఎంజీఎం పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సంధ్యారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.