భూసేకరణ సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
1
కలెక్టరేట్
2020-10-08 19:45:25
విజయనగరం జిల్లాలో నిర్ణీత కాలవ్యవధిలోగా ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణకు సంబంధించి, కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ, తోటపల్లి తదితర కొన్ని ప్రాజెక్టుల భూసేకరణలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్నా, కొన్ని రకాల సమస్యలు ఎదురుకావడం సాధారణ విషయమని అన్నారు. వాటిని సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దీనికోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, సంబంధిత రైతులతో మాట్లాడాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న విఆర్ఓలు, విఆర్ఏలు, జెఇల సేవలను వినియోగించుకోవడం ద్వారా వీటిని త్వరగా పరిష్కరించవచ్చునని చెప్పారు. అప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే, తన దృష్టికి తీసుకురావాలని, వాటిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రతీ పనికీ నిర్ణీత కాలవ్యవధిని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని జెసి కిశోర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భానుప్రకాష్, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.వెంకటేశ్వర్లు, హెచ్‌వి జయరామ్, సాల్మన్ రాజు, కె.బాలాత్రిపుర సుందరి, టిటిపిఆర్, బొబ్బిలి ఇరిగేషన్ ఎస్ఇలు కె.పోలేశ్వర్రావు, ఎన్.వి.రాంబాబు, పలువురు ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.