పేదల ఇళ్లు నాణ్యతగా నిర్మించాలి..
Ens Balu
2
Srikakulam
2020-10-09 18:42:43
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన గృహనిర్మాణ పథకం అమలులో నాణ్యత, తదితర అంశాలను పాటిచడంలో తీసుకోవలసిన చర్యలపై గృహనిర్మాణ సంస్ధ ఇంజినీర్లకు శిక్షణ ఇప్పించడానికి తిరుపతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టీ)తో గృహనిర్మాణ శాఖ అవగహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ సంస్ధ ఇంజనీర్లకు, గ్రామ సచివాలయ ఇంజనీరింగు సహాయకులకు నాలుగు రోజుల ఇంటర్నెట్ ఆధారిత శిక్షణా తరగతులు గురువారం ప్రారంభం అయ్యాయి. శిక్షణకు హాజరైన ఇంజనీర్లను ఉద్దేశించి అజయ్ జైన్ మాట్లాడుతూ పేదలందరికీ నాణ్యమైన గృహాలు కట్టాలని ముఖ్యమంత్రి, నిర్ణయించారని, గృహనిర్మాణానికి నాణ్యమైన ఇనుము, సిమ్మెంటు ఇతర ముడిపదార్ధాలు సరఫరా చేయడం జరిగిందన్నారు. గృహ నిర్మాణంలో ఆధునిక పద్ధతులు, విధిగా పాటించాల్సిన అంశాలపై ఇంజినీర్లు శిక్షణ పొందాలని ఆయన సూచించారు. కాలుష్య రహితంగా పూర్తి భద్రతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని అయన సూచించారు. శిక్షణ తరగతులు నిరంతరం కొనసాగుతాయని, ఇంజినీర్ల బృందాలను తిరుపతి ఐ.ఐ.టికి పంపిస్తామని, అక్కడ ఉన్న ల్యాబులు ఇతర కట్టడాల వివరాలపై ఇంజినీర్లు అవగాహన పెంచుకోవచ్చని అని అయన వివరించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్.నవీన్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా ఈ శిక్షణ తరగతులలో పాల్గొంటున్నారని, వారికి కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, నాణ్యతపరమైన విషయంలో సందేహాలు ఉంటే శిక్షణా తరగతులలో నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. తిరుపతి ఐ.ఐ.టీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.సత్యనారాయణ ప్రసంగిస్తూ సివిల్, పర్యావరణ విభాగాలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లు ఈ శిక్షణ తరగతులలో పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ సి.హెచ్.మల్లికార్జున రావు మాట్లాడుతూ వివిధ స్థాయిలకు చెందిన 11 వందల మందికి పైగా ఇంజినీర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని, నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలపై అవగహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నుండి ఇంటర్నెట్ ద్వారా గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, గ్రామ సచివాలయ ఇంజనీరింగు సహాయకులు తదితరులు పాల్గొన్నారు.