శిశువుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-09 19:03:16

ప్రతి శిశువు వయస్సుకు తగ్గ బరువు ఉండే విధంగా వచ్చే ఏడాది మార్చి నెల 31 తేదీ' లోపల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనము నందు జిల్లా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తక్కువ బరువుతో పిల్లలు జన్మించుట వలన పౌష్టికాహారలోపంతో మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారన్నారు. పౌష్టిక ఆహారాన్ని లోపాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  జిల్లాలో పెరుగుదల మందగించిన, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను, వయస్సుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను గుర్తించాలన్నారు. అందుకు క్షేత్రస్థాయిలో ఐసిడిఎస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో వివిధ సంక్షేమ పథకాల అమలుపై పిల్లల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.త్వరలో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో ఐసిడిఎస్ శాఖ చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  జిల్లాలో 0 - 6 వయసు కలిగిన పిల్లలను, బరువు తగ్గిన పిల్లలను గుర్తించాలని పేర్కొన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, మంగళవారం లోపు తనకు నివేదిక అందజేయాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు. బరువు తక్కువ కలిగిన పిల్లలను గుర్తించిన, సక్రంగా రికార్డులు నిర్వహించిన సికే పల్లి, ధర్మవరం, గుత్తి, కంబదూరు, ఉరవకొండ, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం సీడీపీఓలను జిల్లా కలెక్టర్ అభినందించారు. వారానికి రెండు సార్లు సంబంధిత సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.సంబంధిత అధికారులతో గ్రామాలలో శానిటేషన్ పైన   ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయో, లేదో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 872 అంగన్వాడీ కేంద్రాలకు స్థల సేకరణ కార్యక్రమం పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం పనులపై ప్రతిరోజు నివేదికలు అందజేయాలని సూచించారు.  బాల సంజీవని, గోరుముద్ద కార్యక్రమం, వైయస్ఆర్ సంపూర్ణ పోషక ఆహార పథకాలపై జిల్లాలో అమలుచేస్తున్న తీరుపై సమీక్షించారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించవలసిన బాధ్యత ఐసిడిఎస్ సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) సిరి, ఐసిడిఎస్ పి డి చిన్మయ దేవి, డి సి పి వో సుబ్రహ్మణ్యం జిల్లాలోని సి డి పి ఓ లు, సూపర్వైజర్లు,నోడల్ ఆఫీసర్ వనజ, అక్కమ్మ,  తదితరులు పాల్గొన్నారు.