పథకాల్లో యువతను భాగస్వాములను చేయాలి..
Ens Balu
1
Anantapur
2020-10-09 19:06:10
నెహ్రూ యువ కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో యువత భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ డా. ఏ.సిరి ( గ్రామ, వార్డు సచివాలయ లు మరియు అభివృద్ధి) పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో యువజన సంఘాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నెహ్రు యువ కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని, ఇందులో ముఖ్యంగా యువత భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ వై కె ద్వారా యువతకు వివిధ రకాల వృత్తి విద్య పై శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే ఆరోగ్య, మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పచ్చదనం పరిశుభ్రత, నీటి ఉపయోగం తదితర కార్యక్రమాలను నెహ్రూ యువ కేంద్రం ద్వారా చేపట్టాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల నిర్వహణ ,జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు యువతను మరియు యువజన సంఘాలను అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాలేజీ స్థాయిలో ఉండే విద్యార్థులు కూడా నెహ్రూ యువ కేంద్రం ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా దృష్టిని సారించాలన్నారు. ముఖ్యంగా యువత మొక్కలు నాటడం తో పాటు వాటి సంరక్షణ కోసం కృషిచేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం మరియు ప్లాస్టిక్ వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లో మాస్కులు, శానిటైజర్ వాడకం పై తెలియజేయాలని, ప్లాస్మా దానం యొక్క విశిష్టత మరియు అవసరం గురించి ప్రజలకు చైతన్యం కలిగించాలన్నారు. కోవిడ్ సమయంలో యువత అందరూ కలిసికట్టుగా పనిచేసి సమైక్య అభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం 2020- 21 ఆర్థిక సంవత్సరం లో నెహ్రూ యువ కేంద్రం ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి సందీప్ కుమార్, డి డి ఓ శ్రీనివాసులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. నాగలింగారెడ్డి, ప్రకృతి వైద్య సంస్థ ప్రతినిధి మహేష్ బాబు, పలువురు ఎన్ వై కె వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.