రైతు పథకాలకు విశాఖ డెయిరీ తోడు..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-09 19:49:56

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం అమలులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, పసుగాణభివృద్ధి, పంచాయతీరాజ్ తదితర శాఖలతో భాగస్వా మ్యం అయ్యేందుకు విశాఖ డెయిరీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంయుక్త కలెక్టరు జె.వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఒప్పందం జరిగింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా జిల్లాలను వివిధ విభాగాలతో కలిసి పని చేయడానికి విశాఖ డెయిరీ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. వైఎస్సార్ పథకంలో భాగంగా రైతులకు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గేదెలను, ఆవులను తీసుకొచ్చేందుకు విశాఖ డెయిరీ యాజమాన్యం తోడ్పాటు అందిస్తుందని ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు డెయిరి తరపున సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఆపరేటింగ్ అధికారి డా. కె.వి.ప్రసాద్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ పథకం అమలులో మా సంస్థ తరఫున తగిన సేవలు అందిస్తామని.. అవసరమైతే రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. హర్యానా, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి గేదెలు, ఆవులు కొని తెచ్చుకొనే రైతులకు సంస్థ తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రైతుకు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు, అక్కడ ఉండేందుకు వసతి, రవాణా ఖర్చులు ఇస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో మేలుజాతి పశువులను కొనేందుకు.. అక్కడ నుంచి తీసుకొచ్చేందుకు  సహకారం అందిస్తామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెంచుకొనే పశువులకు తొలి నెల ముందస్తు లోన్ పై ఆర్థిక సాయం, పశుదానా, వైద్య సదుపాయం కల్పిస్తామని డెయిరి చీఫ్ ఆపరేటింగ్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా జెసి జె.వెంకటరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు పలు అంశాలపై విశాఖ డెయిరీ అధికారుల నుంచి స్పష్టత రాబట్టారు. రైతులకు అందిచే అదనపు సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెయిరీ పాల కేంద్రాల్లో పలు పోసే రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం తీసుకొచ్చిందని దీనిలో భాగంగా ఏడాదికి ఒక్కొక్కరికి ,రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి పీ డీ సుబ్బారావు చెప్పారు. ఈ పథకం ఫలవంతం అయ్యేందుకు డెయిరీ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జెసి వెంకటరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేప్మా పీడీ సుగుణఖర్ రావు, పశుగణభివృద్ది శాఖ పీ డీ ఏ వీ నరసింహులు, విశాఖ డెయిరీ డైరెక్టర్ కాటమయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.