అంభేత్కర్ ఆశయ సాధన దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం..
Ens Balu
3
Anandapuram
2020-10-09 19:57:50
మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్దతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లాపరిషత్ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని రూ.1350/- విలువ చేసే 1) 3 జతల ఏకరూప దుస్తులు 2) స్కూలు బ్యాగు 3) ఒక జత బూట్లు మరియు 2 జతల సాక్సులు 4) స్కూలు బెల్టు 5) నోటు పుస్తకాలు 6) పాఠ్యపుస్తకాలు గల కిట్లను పంపిణీచేసారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పేదవారు చదువుకోవాలన్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ముఖ్యమంత్రి ఆచరణలో అమలుచేస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో శత శాతం బాలబాలికలు పాఠశాలలకు హాజరై గుణాత్మక విద్యను అభ్యసించాలని, మెరుగైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో జగనన్న విద్యా కానుక కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు వరకు జిల్లాలో 43 మండలాలలో 4064 పాఠశాలలలో 2,03,200 మందికి విద్యాకానుక కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం క్రింద పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆడపిల్లలకు సాధికారత రావాలంటే చదువు ద్వారానే సాధ్యమని తద్వారా తమకాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటివద్దకే తీసుకువెళ్లామన్నారు. అగనంపూడి- బోగాపురం మెట్రోరైల్ ప్రోజెక్టు ద్వారా విశాఖనగరం అభివృద్ది చెందుతుందన్నారు.
జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఎవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువు మద్యలో మానివేయకూడదని ప్రభుత్వం విద్యార్థులకు అనేక పధకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. జగనన్న విద్యాకానుక వలన విద్యార్థుల ఆత్మ విశ్వాసం పెరుగుతందని తెలిపారు. ముఖ్యమంత్రి వారి ఆదేశాలమేరకు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలో గల పాఠశాలలు, హస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా 30 శాతం అనగా 1100 పాఠశాలలను సుమారు 360 కోట్ల రూపాయలతో మౌళిక వసతులు కల్పించడం జరిగిందని, మంచినీరు, కరెంటు, టాయిలెట్స్, కాంపౌండు వాల్ మొదలైన 9రకాల అవసరాలకు ప్రాధాన్యమిచ్చి పనులు పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. 2023 సంవత్సరానికి జిల్లాలో మొత్తం పాఠశాలలకు నాడు-నేడు కార్యక్రమంద్వారా మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా త్వరలో అంగన్వాడి సెంటర్లను ప్రి ప్రైమరీ స్కూలుగా మార్పుచేసి 3-6 సంవత్సరాల పిల్లలకు విద్యనందించనున్నట్లు తెలిపారు. అందుకుగాను అంగన్వాడి సెంటరు నిర్మాణానికి అయ్యే ఖర్చును 10 లక్షలరూపాయల నుండి 15 లక్షలకు పెంచి మంజూరు చేయడమైనదని తెలిపారు. విద్యార్థుల శరీర పెరుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో గోరుముద్ద పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అవసరమైన మెనూ మార్చి అందించడం జరిగిందని తెలిపారు. జగనన్న వసతి విద్యాదీవెన పధకం ద్వారా ఉన్నత చదువులను ప్రభుత్వం ప్రోత్సహస్తున్నదన్నారు. అనేక ఉన్నత విద్యా సంస్థలను విశాఖజిల్లాలో నెలకొల్పడం జరిగిందని తెలిపారు.
జాయింటు కలక్టరు అరుణ్ బాబు మట్లాడుతూ నాడు-నేడు పనులను నాణ్యతలో రాజీపడకుండా చేపట్టడం జరిగిందని తెలిపారు. నాడు-నేడు పనులు పూర్తయిన పాఠశాలలలో చేరుటకు విద్యార్థులు పోటీపడుతున్నారని, సీట్లకొరత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి, సమగ్ర శిక్ష అదనపు పదక సంచాలకులు బి. మల్లిఖార్జునరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్, ప్రధానోపాద్యాయులు ఇ.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.