ఇ-పంట (క్రాప్) లో నమోదు కావాలి..


Ens Balu
1
Srikakulam
2020-10-09 21:08:14

శ్రీకాకుళం జిల్లాలో రైతులు తమ పేర్లను ఇ – క్రాప్ లో నమోదు చేయించుకోవాలని జిల్లా  కలక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేసారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో వరి, మొక్క జొన్న, ప్రత్తి, వేరుశనగ, పెసర, గోగు, చెరకు, రాగి మొదలగు పంటలు పండించడం జరుగుతుందని ఆయన పేర్కొంటూ పంటలు సాగు చేస్తున్న రైతులు తమ పేర్లను గ్రామ వ్యవసాయ సహాయకులు (వి.ఏ.ఏ) ద్వారా ఇ-పంటలో నమోదు (రిజిస్ట్రేషన్) చేయించుకోవాలని అన్నారు. అక్టోబరు 11 నుండి 15 వ తేది వరకు పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. జాబితాలో తమ పేరు నమోదు అయినది లేనిది రైతులు పరిశీలించుకోవాలని, జాబితాలో పేర్లు లేని వారు వెంటనే నమోదు చేయించుకోవాలని కోరారు. అక్టోబరు 15 వ తేది నాటికి మార్పులు చేర్పులు ఉంటే సరిచేసి తుది జాబితా రూపొందిస్తారని ఆయన స్పష్టం చేసారు. ఇ - పంట నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని, ఇ - పంటలలో నమోదు చేసుకున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్ట పోయినప్పుడు నష్ట పరిహారం చెల్లింపు, ఉచిత పంటల బీమా, పంట కొనుగోలు తదితర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అదే విధంగా పంట ఋణాలు పొందుటకు, ఇతర ప్రభుత్వ పథకాలను పొందుటకు, ఇ - పంటలో నమోదు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. జిల్లా రైతాంగం ఇ - పంట నమోదు కార్యక్రమాన్ని తప్పక వినియోగించుకుని ప్రభుత్వం కల్పించే సదుపాయాలను పొందాలని ఆయన సూచించారు.