శ్రీనివాస్ లేరనే తలచుకుంటే నోటిమాట రావడం లేదు..


Ens Balu
3
Visakhapatnam
2020-10-10 17:45:53

ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణవార్త విన్నాక బాధని వ్యక్తపరిచేందుకు తనకు మాటలు రావడం లేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక మంత్రి  బొత్స సత్యనారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం  డాక్టర్స్ కాలనీలో గల స్వర్గీయ  ద్రోణంరాజు శ్రీనివాసరావు గృహాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు  శ్రీనివాస రావు సతీమణి, ఆయన కుమారుడు శ్రీవాస్తవను కలిసి పరామర్శించి మాట్లాడారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ద్రోణంరాజు శ్రీనివాసరావు తండ్రి వారసత్వంతో పాటు నిబద్ధత గల, మచ్చ లేని నాయకుడిగా రాజకీయ విలువల్ని కొనసాగించారని అన్నారు.  ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరనిలోటని అన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ చాణుక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇక లేరనే వార్త అందరినీ కలచివేసిందని, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు మూగబోయిందంటూ ఆవేదన వ్యక్తం  చేశారు.  ఈ విపత్కర పరీక్ష సమాయాన్ని ఎదుర్కొనేలా  ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్.ఏ. రెహమాన్,  భరణీకాన రామారావు తదితరులు  ద్రోణంరాజు శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.