మీసేవలకు మా సలాం..
Ens Balu
1
Srikakulam
2020-10-10 18:28:42
మీరు జీవితాలను పణంగా పెట్టారు... మీ సేవలు మరువలేం ... అన్నారు జిల్లా కలెక్టర్ జె నివాస్. జెమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ 19 సేవలలో పాల్గొని విధులు ముగించు కుని ఇళ్ళకు తిరిగి వెళుతున్న కోవిడ్ వారియర్స్ కు శని వారం జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. మార్చి నెల నుండి కరోనాతో పోరాడుతున్నాం. కరోనా వైరస్ సోకిన వారికి సేవల కోసం మూడు నెలలకు తాత్కాలికంగా ఉద్యోగాల్లో నియమించామని, మీరు అందరూ జీతాల కోసం కాకుండా జీవితాలను పణంగా పెట్టి సేవలందించారని ప్రశంసించారు. మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా దగ్గర చేరని సమయంలో, అంత్యక్రియలకు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కోవిడ్ వారియర్స్ గా మీరు అందించిన సేవలు మరువలేనివి అన్నారు. అనవసర భయంతో, అవగాహన లోపంతో సరైన సేవలు వినియోగించు కోలేకపోయారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న మీరందరూ ధైర్యంగా సేవ చేయాలనే దృక్పధంతో పని చేశారని, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చిన మీ అందరికి జిల్లా రుణపడి ఉంటుందని అన్నారు. మిగతా వ్యాధుల వేరు - కరోనా వ్యాధి వేరు. ఏ జబ్బుకు అయినా సేవ చెయ్యడానికి బంధువులు వచ్చేవారు కానీ కరోనా వ్యాధి వస్తే బంధువులు ఉన్నారో లేరో అన్నటు వంటి పరిస్థితి అటువంటి సమయంలో మీరే వీరికి అండా దండాగా ఉంటూ బంధువులు, ఆప్తులు కూడా మీరే అయ్యారని కొనియాడారు. కరోనా రోగులకు ముఖ పరిచయం లేని బంధువులుగా మిమ్మల్ని వారు గుర్తు తెచ్చుకుంటారని పేర్కొన్నారు. రోగులకు సిబ్బంది తమ చేత్తో తినిపించే సందర్భాలు కూడా నాకు తెలుసు అన్నారు. రోగుల ప్రాణాలు కాపాడడంలో ప్రత్యేక పాత్ర మీ అందరిదీ అని కొనియాడారు. కరోనా సమయంలో ఎఫ్.ఎన్.ఓ, ఎమ్.ఎన్.ఓలు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని పేర్కొన్నారు. రోగులు రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీల్ చైర్లో బెడ్ వరకు తీసుకువెళ్లి అవసరమైన సపరిచర్యలు అందించడంలో ముందున్నారని ప్రశంసించారు. అనేక ప్రాంతాల్లో రోగులు చెట్లకింద, వరండాలో, అంబులెన్స్ లో చనిపోయిన దుర్ఘటనలు చూసామని, ఇలా శ్రీకాకుళం జిల్లాలో జరగ కూడదు అని నిర్ణయించుకొని జిల్లా అధికారులకి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మన జిల్లాలో ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సహాయ సహకారాలతో కోవిడ్ నుండి కాస్త ఉపశమనం పొందడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో సేవలు అందించి, కోవిడ్ సర్టిఫికెట్ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ సమయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేస్తున్నామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ప్రతీ రోగిని కూడా నా బంధువులానే చూసుకున్నానని, మీరు కూడా అలానే చూసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా అన్ని జిల్లాల కంటే కోవిడ్ నివారణలో మనం ముందున్నామని, మీ అందరూ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాకు మంచి పేరు సంపాదించి పెట్టారని అంటూ మరోసారి మీ అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలుపారు. రెవిన్యూ విభాగం జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా గత నాలుగు నెలల నుండి ఆసుపత్రి సిబ్బంది అందించిన కోవిడ్ సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. జిల్లా అధికారులు మీ సేవలు గుర్తించారని, మీకు ఈ కోవిడ్ సర్టిఫికెట్ అన్నది మున్ముందు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
వార్డు, గ్రామ పంచాయతీ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా కోవిడ్ మహమ్మారికి భయపడి స్వంత కుటుంబ సభ్యులే రోగుల దగ్గరికి చేరడానికి ధైర్యం చేయలేదని, అటువంటి సమయంలో మీరు అందరూ కలసి ప్రాణాలకు తెగించి కోవిడ్ సేవలు అందించారని అన్నారు. మనందరం ఇలా పనిచేయడానికి మన జిల్లా కలెక్టర్ కృషి మరువలేనిది అని అన్నారు. కలెక్టర్ ముందు చూపు వలన కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరగకుండా జిల్లాని మీ అందరి సహాయ సహకారాల వలన నెరవేరింద అని అన్నారు. కోవిడ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్ మాట్లాడుతూ మొట్ట మొదటి గా ఏప్రిల్ 23 న మొదటి కోవిడ్ కేసుతో ప్రారంభమైన జెమ్స్ ఆసుపత్రి సేవలు ఇప్పటి వరకు 5 వేల 2 వందల మందికి సేవలు అందించిందన్నారు. ఇప్పటి వరకు 4900 మంది కోవిడ్ తగ్గు ముఖం పట్టి తమ ఇళ్లకు క్షేమంగా చేరుకున్నారని తెలిపారు. ఏ సమయానికి ఏమి కావాలో, ఎలాంటి సహాయ సహకారాలు కావాలో ప్రతీ క్షణం రాత్రనక, పగలనక మాకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సాహించిన కలెక్టర్ నివాస్ ,జాయింట్ కలెక్టర్లు శ్రీనివాసులు, సుమిత్ కుమార్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వారియర్స్ కు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్రనాయక్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ, జెమ్స్ వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డిప్యూటి ఆర్.ఎం.ఓ డాక్టరు ప్రవీణ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.