ఎంపీ లాడ్స్ పనులు నెలాఖరుకు పూర్తిచేయాలి..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-10 19:29:55

అనంతపురం జిల్లాలో ఎంపీ ల్యాండ్స్ కింద చేపట్టిన అన్ని రకాల పనులను అక్టోబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీ ల్యాండ్స్ కింద చేపట్టిన పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 16వ, 17 వ లోక్ సభ కు చెందిన ఎంపీ ల్యాండ్స్ కింద అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో, రాజ్యసభ ఎంపీ ల్యాండ్స్ కింద చేపట్టిన వివిధ రకాల పనులపై సమీక్ష నిర్వహించి, అక్టోబర్ నెలాఖరులోపు సిసిరోడ్డు, తాగునీటి సరఫరా పథకాలు, స్మశానవాటికల ప్రహరీ గోడల నిర్మాణం తదితర అన్ని రకాల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మొదలు కాని పనులకు సంబంధించి నిధులు వచ్చే అవకాశం లేనందున వాటిని ప్రారంభించరాదన్నారు. పురోగతిలో ఉన్న పనులు మాత్రం ఈ నెలాఖరులోపు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా పనులను నాణ్యతగా చేపట్టాలని, ఎటువంటి ఆలస్యం చేయకుండా పనులు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పనులకు సంబంధించి ఎటువంటి భూమి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ల్యాండ్స్ కింద ఎక్కడెక్కడ పనులు పెండింగ్లో ఉన్నాయి, అసెంబ్లీ నియోజక వర్గం వారీగా ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి, ఆయా పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, సిపిఓ ప్రేమచంద్ర, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపిడబ్ల్యూఐడిసి ఈ ఈ శివకుమార్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.