నాడు-నేడు పనులు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
1
కలెక్టరేట్
2020-10-11 12:19:10
విజయనగరం జిల్లాలో మనబడి నాడూ-నేడు పనులను ఈనెల 20 వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. పూర్తి చేయించాల్సిన బాధ్యత మండల ప్రత్యేకాధికారులదేనని స్పష్టం చేశారు. నాడూ-నేడు పనులపై మండలాలవారీగా, పనుల వారీగా ఆయన ఆన్‌లైన్ ద్వారా ఆదివారం సమీక్షించారు. ఆయా మండలాలోని పనుల పురోగతిని వెళ్లడించారు. నాడూ-నేడు పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతిస్తోందని చెప్పారు. పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్దమవుతున్న తరుణంలో, ఎట్టి పరిస్థితిలోనూ పనులను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకాధికారులు నిరంతరం మండలాల్లో పర్యటిస్తూ, పనులపై సంబంధిత హెడ్‌మాస్టర్లు, ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంఇఓలు తదితర అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించాలని సూచించారు. అలాగే బాగా తక్కువ పురోగతి ఉన్న పనులను క్షేత్రస్థాయిలో నేరుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రగతినివేదికను ఎప్పటికప్పుడు సర్వశిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌కు అందజేయాలన్నారు.
నాడూ నేడు కార్యక్రమం క్రింద త్రాగునీటికి సంబంధించి తొలివిడతగా మొత్తం 1040 పనులు ప్రతిపాదించగా, 957 పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 953 పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రహరీగోడల నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ ప్రాంతంలో 1040 పనులు ప్రతిపాదించగా, వీటిలో 39 పనులను మంజూరు చేసి, పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. మరమ్మతులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1040 పనులు ప్రతిపాదించగా, వీటిలో 1026 పనులను మంజూరు చేశామని, 1025 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 1040 పాఠశాలలకు విద్యుదీకరణ, విద్యుత్ మరమ్మతు పనులను ప్రతిపాదించగా, 1039 పనులను ఆమోదించామని, 1036చోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. 1040 పాఠశాలలకు మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రతిపాదించగా, 947 పనులు మంజూరు చేశామని, వీటిలో 815చోట్ల పనులు వివిధ స్థాయిలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ప్రారంభంకానిచోట తక్షణమే పనులను ప్రారంభించాలని, అన్నిటినీ ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసేలా యుద్దప్రాతిపదికన పనులను నిర్వహించాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు.