అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-11 17:38:35
బంగాళాఖాతంలో అల్ప పీడనం వలన రేపు ఉదయం నుండి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనల దృష్ట్యా జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 5.30 గంటల నుండి తీవ్రత పెరగవచ్చన్న వాతావరణ శాఖ సూచనలను మేరకు ఆర్డీవో, ఇరిగేషన్, వ్యవసాయం, మత్య్స శాఖ, రహదారులు మరియు భవనముల శాఖ, తదితర శాఖల అధికారులతో ఆదివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులైన రైవాడ, తాండవ జలాశయాలు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కోణాం, పెద్దేరు జలాశయాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జలాశయాలకు దిగువనున్న గ్రామస్తులను అప్రమత్తత చేసి నీటిని విడుదల చేయాలన్నారు. మండలాల్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించాలని ఎస్.ఇ. ఇరిగేషన్ ను ఆదేశించారు. తహసిల్థార్లంతా మండల కేంద్రాల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డిఓలను ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లోని తహసిల్థార్లు, అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డివిజనల్ అధికారులు అప్రమత్తతో ఉండాలన్నారు. ఆర్డిఓల కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. మత్య్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెల్లకుండా నిషేధించాలని జె.డి. ఫిషరీష్ ను ఆదేశించారు. వేటకు వెళ్లి సముద్రంలో వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాలను పరిశీలించి నివేదికలను అందజేయాలని వ్యవసాయ శాఖ జె.డి., ఉద్యాన వన శాఖ ఎ.డి.లను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు నుండి జె.డి. వరకు అప్రమత్తతతో ఉండాలన్నారు. నష్టాలను త్వరితగతిన ఎన్యూమరేట్ చేసి తక్షణమే నివేధిక అందజేయాలని ఆదేశించారు. ఖరీఫ్ పంటలో నష్టపోయిన అన్ని వివరాలను అందజేయాలన్నారు. రహదారులలో ఎక్కడైనా చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే తక్షణమే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ విషయంపై ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 0891–2590102, 0891-2590100 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టెలి కాన్పరెన్స్ లో జివియంసి కమీషనర్ డా.జి. సృజన, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, పాడేరు సబ్ కలెక్టర్ శివజ్యోతి, విశాఖపట్నం, అనకాపల్లి ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, జె.డి. ఫిషరీష్, ఇరిగేషన్ ఎస్.ఇ, ఎపిఎంఐపి పిడి, సిపిఓ, తదితర అధికారులు పాల్గొన్నారు.