పైడితల్లమ్మ సిరిమానుకి ప్రత్యేక పూజలు..
Ens Balu
2
బలరామపురం
2020-10-12 14:01:12
ఉత్తరాంధ్ర కల్పవల్లి, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును విజయనగరం తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. దీనిలో భాగంగా జామి మండలం భీమసింగి సమీపంలోని బలరాంపురం వద్ద గుర్తించిన సిరిమాను, ఇరుసుమాను చెట్లకు సోమవారం ఉదయం సంప్రదాయభద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లను నరికే ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా పైడితల్లి అమ్మవారి ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు గొడ్డలితో చెట్టుపై తొలివేటు వేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన భక్తులను, చెట్ల దాతలు బలరామపురం గ్రామానికి చెందిన పెంట సన్యాసప్పడు, పెంట తమ్మినాయుడు, పెంట అప్పలనాయుడు, పెంట ఎర్రునాయుడు కుటుంబాలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూనే, అమ్మవారి పండుగను సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో పండుగ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని కోరారు. సిరిమానోత్సవాన్ని, అమ్మవారి పూజలను తిలకించేందుకు ప్రతీ వార్డులో ఎల్‌సిడి స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఒక్కసారి మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆలయంలో రద్దీ తగ్గుతుందని అన్నారు. అలాగే సుమారు నెలరోజుల పాటు పండుగ జరుగుతుందని, కాబట్టి, భక్తులు సిరిమానోత్సవం వరకూ వేచిఉండకుండా, ముందుగానే అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, భక్తుల రక్షణకు అన్నిరకాల చర్యలనూ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మాజీ పార్లమెంటు సభ్యులు బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తహతహలాడుతున్నారని అన్నారు. అయితే దర్శనం చేసుకొనే సమయంలో తప్పనిసరిగా ప్రతీఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. సంప్రదాయాల ప్రకారమే ఈ ఏడాది కూడా పండుగలోని అన్నిఘట్టాలు జరుగుతాయని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, ఆర్‌డిఓ బిహెచ్.భవానీశంకర్, పైడిమాంబ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిడిఎస్ఎస్ఆర్ సుబ్రమణ్యం, డిఎస్‌పిలు వీరాంజనేయరెడ్డి, ఎల్.మోహనరావు, ఇంకా రెవెన్యూ, అటవీశాఖాధికారులు, పైడిమాంబ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.